హీరో క్యారెక్టరైజేషన్‌లు తీర్చిదిద్దడంలో స్పెషలైజేషన్ చేసిన  పూరి జగన్నాథ్‌కు పెట్టింది పేరు.  అలాగే యూత్‌లో తనదైన శైలి యాటిట్యూట్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌కు ఎంత క్రేజ్ వచ్చిందంటే ఈ సినిమాకు సంభందించిన ప్రతీ విషయం వైరల్ అవుతోంది.  'ఫైటర్'  టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం వెళుతూండగా విజయ్ దేవరకొండ కాలు జారింది. ఇప్పుడీ విషయానికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ముంబైలోని ఓ హార్బర్ సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది.

ఫైటర్ షూటింగ్ నిమిత్తం పూరీ జగన్నాథ్, చార్మీ షూట్ స్పాంట్  ముందు వచ్చేశారు. వారంతా బోట్ లో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ మెల్లిగా వచ్చాడు. రోడ్డు నుంచి బోట్ వరకూ వచ్చే దారి కాస్తంత ఇరుకుగా, అటూ ఇటూ మరపడవలతో నిండి వుండడంతో, వాటి మధ్య నుంచే షార్ట్, బ్లాక్ టీ షర్ట్ వేసుకుని విజయ్ వచ్చాడు.

బోటు వద్దకు నడుస్తూ వుంటే, అక్కడే ఉన్న ఫ్యాన్స్ 'విజయ్ అన్నా... విజయ్ అన్నా...' అంటూ హడావుడి చేయడం జరిగింది.  ఇదంతా ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. అభిమానులు  వైపు చూస్తూ, చిరునవ్వులు చిందిస్తూ వేగంగా నడిచిన విజయ్, ఓ చోట కాలు జారాడు. కింద పడబోతుంటే, ప్రక్కనున్న ఆయన అనుచరులు ఒడుపుగా పట్టుకున్నారు.  

ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విష్ణురెడ్డి, మకరంద్‌ దేశ్‌ పాండే, గెటప్‌ శ్రీనులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ‘ఫైటర్‌’ను ఏకకాలంలో తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కిస్తున్నారు.