విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీలో స్పష్టత రాలేదు. ముందు అక్టోబర్ 4న రావాలనుకున్న సినిమా అక్టోబర్ 18కి వెళ్లిందని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదంలో ఇరుక్కుంది. 'నోటా' సినిమాకు తెలుగు డైలాగ్స్ తాను రాస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ మాత్రం క్రెడిట్, రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారంటూ రచయిత శశాంక్ వెన్నెలకంటి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

''నోటా' ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ నేను రాశాను. కానీ ఆనంద్ శంకర్ మాత్రం డైలాగ్స్ కూడా తనే రాసినట్లు పేరు వేసుకున్నారు. టైటిల్స్ లో నా పేరు చేర్చి రెమ్యునరేషన్ ఇచ్చే వరకు సినిమాను విడుదల చేయడానికి వీల్లేదంటూ'' ఫిర్యాదులో పేర్కొన్నారు శశాంక్ వెన్నెలకంటి.

ఈ విషయంపై స్పందించిన దర్శకుడు ఆనంద్ శంకర్.. నేను రాసిన డైలాగ్స్ ని అనువదించడం తప్ప శశాంక్ కొత్తగా చేసిందేమీ లేదని తమిళ మీడియా ముఖంగా చెబుతున్నారు. ఈ వివాదం ఓ కొలిక్కి వస్తే కానీ సినిమా రిలీజ్ కి మార్గం సుగమం అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.