వరుస హిట్లతో దూసుకెళ్తున్న విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డితో హిట్ కొట్టిన విజయ్ క్యూ కడుతున్న సినిమా అవకాశాలు
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని స్నేహితుడిగా మంచి మార్కులు కొట్టేసిన విజయ్.. తర్వాత పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా ఎవరూ ఊహించని విజయం సాధించడంతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత వచ్చిన ద్వారక చిత్రం కాస్త పర్వాలేదనిపించినా.. అర్జున్ రెడ్డి సినిమాతో పెద్ద హిట్ కొట్టేశాడు. సినీ ఇండస్ర్టీ ప్రముఖులు ఆ సినిమాలో విజయ్ నటనను చూసి మెచ్చుకోకుండా ఉండకోలేకపోయారు. అంతలా ఇరగదీశాడు.
ఈ సినిమా విజయంతో.. విజయ్ కి సినిమా అవకాశాలు వరసకట్టాయి. మహానటి సినిమాలో ఓ కీలక పాత్రకు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో పరశురాం సినిమాలో నటిస్తున్నాడు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.
క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో త్రీ జెనరేషన్స్ ఆఫ్ లవ్ ఉంటుందట. కొత్త కథ వినగానే నచ్చేయడంతో విజయ్ దేవరకొండ సినిమాకు సైన్ చేశాడట. 2018 మొదట్లో ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా ‘ఎన్నెన్నో అందాలు’ పేరుని పరిశీలిస్తున్నారని టాక్. విజయాలు వచ్చినప్పుడు అవకాశాలు రావడం సర్వసాధారణం. అలాంటి సమయంలోనే ఆచితూచి అడుగువేయాలి. మరి ఈ విషంయలో విజయ్ దేవరకొండ తీసుకుంటున్న నిర్ణయం సరైందో కాదో తెలియాలంటే.. ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలి.
