సినీ రంగాన్ని వరుగాస విషాదాలు వెంటాడుతున్నాయి. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ ప్రముఖుల మరణాలు ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం కలిగిస్తున్నాయి. బాలీవుడ్ వరుసగా లెజెండరీ స్టార్లు మరణించటం దిగ్బ్రాంతి కలిగించింది. ఇర్పాన్‌ ఖాన్‌, రిషీ కపూర్‌, జగదీప్‌ లాంటి సీనియర్లతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ లాంటి యువ నటుల మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది.

కన్నడ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాండల్‌వుడ్‌లో కూడా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. యువ నటుడు చిరంజీవి సర్జ మృతితో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న వయసులోనే చిరంజీవి గుండెపోటుతో మరిణించటం అందరినీ కదిలించింది. తరువాత సీనియన్‌ నటుడు గంగాధర్‌ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తాజాగా మరో సీనియర్‌ నటి శాంతమ్మ తుది శ్వాస విడిచారు.

దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించిన శాంతమ్మ వయసు 94 సంవత్సరాలు. 1956 నుంచి కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వటంతో శాంతమ్మను మైసూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు నివాళులర్పించారు.