కరోనా కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో సినీ తారల మరణాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. తాజాగా మరో సీనియర్‌ నటి ఆసుపత్రి పాలు కావటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 500లకు పైగా సినిమాల్లో నటించిన లెజెండరీ నటి జయంతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు.

జయంతి శ్వాసకి తీసుకోవటంతో ఇబ్బందులు ఎదురవ్వటంతో పాటు ఆస్తామా తీవ్రం కావటంతో కుమారుడు కృష్ణ కుమార్ ఆమెను దగ్గరలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసువచ్చాడు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆమె కరోనా పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వర్గాలు నెగెటివ్ రిజల్ట్‌ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్టేబుల్‌గానే ఉందని వెల్లడించారు.

కొంత కాలం క్రితం ఇలాగే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆమె ఆసుపత్రిలో జాయిన్‌ కావటంతో ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆమె చనిపోయినట్టుగా వార్తలు రావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే జయంతి కుమారుడు ఆమె దాదాపు 35 ఏళ్లుగా ఆస్థామాతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.

జయంతి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠి భాషల్లో నటించారు. ఉత్తమ సహాయ నటిగా ప్రెసిడెంట్‌ మెడల్‌తో పాటు మరెన్నో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. తెలుగులో స్వాతి కిరణం, పెదరాయుడు, భార్య భర్తలు, జగదేకవీరుని కథ, సుమంగళి లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.