Vayuputra: సితార నిర్మాణ సంస్థ “వాయుపుత్ర” అనే యానిమేషన్ మూవీని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది.ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Vayuputra: టాలీవుడ్ లోనూ యానిమేషన్ ప్రాజెక్టుల సందడి మొదలైంది. ఇటీవల విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహా' ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రాఫిక్స్ వండర్ మూవీ కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో రన్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఈ సినిమా సక్సెస్ ఆధారంగా తెలుగులోనూ మరో యానిమేషన్ మూవీ రాబోతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఆ మూవీని ఎవరు నిర్మిస్తున్నారు? అనే వివరాలు మీ కోసం..
ఇండియన్ ఫీల్మ్ ఇండస్ట్రీలో మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ నిర్మాణ నైపుణ్యంతో ఓ భారీ యానిమేషన్ ప్రాజెక్టు తెరకెక్కబోతుంది. ఇవాళ (సెప్టెంబర్ 10న) సితార నిర్మాణ సంస్థ యానిమేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటుగా టైటిల్ వెల్లడించింది. ‘వాయుపుత్ర’ అనే టైటిల్తో వస్తున్న ఈ యానిమేషన్ మూవీని, చందు మొండేటి తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది.
భారీ స్థాయిలో రూపొందుతున్న 3D యానిమేషన్ మూవీ హనుమంతుని కాలాతీత కథను అద్భుతమైన దృశ్యకావ్యంలా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. ఈ పోస్టర్ లో హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన దృశ్యం కనిపిస్తుంది. భక్తి భావన, ఇతిహాస స్థాయిని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాకుండా థియేటర్లు దేవాలయాలుగా మారే పవిత్ర సినిమాగా, ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని భక్తి పరంగా చిత్రంగా తీయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సందర్బంగా సితార సంస్థ ఓ ప్రకటన వెల్లడించింది. అందులో ‘వాయుపుత్ర కేవలం సినిమా కాదు, పవిత్ర దృశ్యం. మన చరిత్ర ఆత్మ నుండి మన ఇతిహాసాల నుండి ప్రాణం పోసుకున్న ఒక అమరుడి కథ. ఈ అద్భుతమైన ఇతిహాసాన్ని సినిమా థియేటర్లలో 3D యానిమేషన్‌లో చూసి థ్రిల్ అవ్వండి. 2026 దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మీ ముందుకు రానుంది’అని పేర్కొంది. పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనుండగా, 2026 దసరాకు థియేటర్లలో అడుగుపెట్టనుంది. గతంలో చందు మొండేటి మైథాలజీ బ్యాక్ డ్రాప్లో 'కార్తికేయ2'తో భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో వాయుపుత్ర సబ్జెక్టుకి చందు అయితేనే న్యాయం చేస్తాడని నిర్మాత నాగవంశీ భావించినట్లు సమాచారం.
