మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతోంది. 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్, వరుణ్ తేజ్ గెటప్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి. 

తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేశారు. 'నా సినిమాలో నా విలనే నా హీరో' అని తమిళ నటుడు అధర్వ చెబుతున్న డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఉగ్ర రూపంలో కనిపిస్తూ ప్రత్యర్థుల్ని వణికిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటాయి. వరుణ్ తేజ్ హెయిర్ స్టైల్, కంటి చూపు, గడ్డం ఇలా ప్రతి అంశం మాస్ అంశాలని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. 

చివర్లో వరుణ్ తేజ్ చెప్పే పంచ్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'అందుకే పెద్దోళ్లు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలి.. రెండు దాచుకోవాలి' అని వరుణ్ డైలాగ్ తో మెప్పించాడు. టీజర్ లో బ్యాగ్రౌండ్ సంగీతం కూడా బావుంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మొత్తంగా టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.