బాలీవుడ్ లో గత కొంత కాలంగా టాలీవుడ్ హిట్ చిత్రాలు తెగ రీమేక్ అవుతున్నాయి. కొత్త పాత అని తేడా లేకుండా మంచి కంటెంట్ దొరికితే చాలు అన్నట్టు బాలీవుడ్ స్టార్ హీరోలు మన కథలని ఏరి కోరి ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు సల్మాన్ పోకిరి - రెడీ - కిక్ సినిమాలను రీమేక్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నట్లే అదే తరహాలో తెలుగు కథలతో హిట్స్ అందుకోవాలని వరుణ్ ధావన్ కూడా సరికొత్తగా ప్లాన్ వేస్తున్నాడు. 

కాకపోతే ఈ కుర్ర హీరో కొత్త కథలను కాకుండా 90ల కాలంలోని కథలను ఎంచుకుంటున్నాడు. 1991లో వెంకటేష్ నటించిన కూలి నెంబర్ 1 సినిమాను రీమేక్ చేయడానికి వరుణ్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో నాగార్జున హలో బ్రదర్ కాన్సెప్ట్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వరుణ్ ఇప్పుడు మరో ఓల్డ్ మూవీతో మ్యాజిక్ చేయబోతున్నాడు. 

అలాగే మరో రెండు తెలుగు కథల రీమేక్ హక్కులను కూడా వరుణ్ సొంతం చేసుకోవడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం. 200 కోట్ల బిజినెస్ తో తనకు కూడా మంచి మార్కెట్ ఉందని నీరిపించిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు.