గోపీచంద్‌, అల్లరి నరేష్‌ నటించిన `రామబాణం`, `ఉగ్రం` చిత్రాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సినిమాలకు వచ్చిన టాక్‌కి, కలెక్షన్లకి పొంతన లేదు. అందరిని షాక్‌ కి గురి చేస్తున్నాయి. 

ఈ శుక్రవారం ప్రధానంగా తెలుగులో రెండు చిత్రాలు విడులయ్యాయి. గోపీచంద్‌ `రామబాణం`, అల్లరి నరేష్‌ `ఉగ్రం`. రెండు మిడిల్‌ రేంజ్‌ చిత్రాలు. పైగా ఇద్దరు హీరోల పరాజయాల్లోనే ఉన్నారు. దీంతో బడ్జెట్‌తోపాటు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా తక్కువగానే ఉంది. శుక్రవారం విడుదలైన రెండు చిత్రాలకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది. `రామబాణం` రొటీన్‌ కమర్షియల్‌ సినిమా అని, `ఉగ్రం` యావరేజ్‌గా ఉందనే టాక్‌ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం రివర్స్ గా ఉండటం గమనార్హం. 

గోపీచంద్‌.. తనకు `లక్ష్యం`, `లౌక్యం` వంటి హిట్లని అందించిన శ్రీవాస్‌ దర్శకత్వంలో `రామబాణం` చేశాడు. ఈ సినిమా భారీగానే రిలీజ్‌ అయ్యింది. కానీ ప్రారంభం నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. దర్శకుడు శ్రీవాస్‌ రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీగా డీల్‌ చేసినా, కాస్త ఫన్‌, ఎమోషన్స్, బ్రదర్స్ సెంటిమెంట్, ఫ్యామిలీ అంశాలు బాగానే ఉన్నా, కథ రొటీన్‌ కావడంతో దీనికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. నెగటివ్‌ టాక్‌తో ప్రారంభమైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 2.45కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. 1.27కోట్ల షేర్‌ దక్కింది.తెలుగు రాష్ట్రాల్లో ఇది 2.20కోట్ల గ్రాస్‌ని, 1.17కోట్ల షేర్‌ని రాబట్టుకుంది. 

ఈ సినమా సుమారు 15కోట్ల(14.50) ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. 15.20కోట్లు రాబడితే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇది బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా 14కోట్లు వసూలు చేయాలి. డిజాస్టర్‌ టాక్‌తో రన్‌ అవుతున్న ఈ సినిమా ఐదు కోట్ల షేర్‌ చేస్తే ఎక్కువ అనే టాక్‌ ఉంది. ఇదే జరిగితే పదికోట్ల నష్టం తప్పదు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి. ఇక ఇందులో గోపీచంద్‌ సరసన డింపుల్‌ హయాతి హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, ఖుష్బూతోపాటు వెన్నెల కిషోర్‌, అలీ, సప్తగిరి, గెటప్‌ శ్రీను, సత్య వంటి కమెడియన్లు నటించారు. 

ఇక ఇదే శుక్రవారం అల్లరి నరేష్‌ నటించిన `ఉగ్రం` చిత్రం విడుదలైంది. మహిళల కిడ్నాప్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని `నాంది` ఫేమ్‌ విజయ్‌ కనక మేడల తెరకెక్కించారు. షైన్‌ స్క్రీన్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సుమారు 15కోట్ల బడ్జెట్ తో నిర్మించబడింది. ఐదు వందలకుపైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినా, కలెక్షన్లు మాత్రం అందుకు రివర్స్ ఉంటున్నాయి. ఇటీవల యావరేజ్‌ చిత్రాలకు పాజిటివ్‌గా కలెక్షన్లు ఉంటున్నాయి. కానీ `ఉగ్రం` చిత్రానికి మాత్రం రివర్స్ అయ్యింది. 

సుమారు ఆరు కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు రూ1.45కోట్ల గ్రాస్‌ రావడం గమనార్హం. 73లక్షల షేర్‌ దక్కింది. కనీసం కోటీ రూపాయలు కూడా ఇది దాటలేకపోయింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా 5.7కోట్ల షేర్‌ రావాలి. కానీ ఇది రెండు కోట్ల వరకు వెళ్తే ఎక్కువే అనే టాక్‌ ఈ కలెక్షన్లు చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తంగా ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలకు ఘోరమైన ఫలితాలు దక్కాయని చెప్పొచ్చు. మరి ఇవి పుంజుకుంటాయా? లేక మొత్తానికే పడిపోతాయా? అనేది చూడాలి. ఇదిలా ఉంటే `ఉగ్రం` టీమ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ చేసుకోవడం ఆశ్చర్యపరిచే అంశం.