బిగ్ బాస్ షోకి మీరు కూడా వెళ్లొచ్చు... కంటెస్టెంట్స్ ని ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
బిగ్ బాస్ అత్యంత పాపులారిటీ షో. బిగ్ బాస్ హౌస్లో ఒక్కసారైనా అడుగుపెట్టాలని చాలా మంది కోరుకుంటారు. మరి బిగ్ బాస్ షోకి సామాన్యులు వెళ్ళొచ్చా? ఎలా ఎంపిక చేస్తారు?
డచ్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ స్ఫూర్తితో ఇండియాలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. యూకేలో ప్రసారమైన బిగ్ బ్రదర్ లో కంటెస్ట్ చేసిన శిల్పా శెట్టి టైటిల్ కైవసం చేసుకోవడం విశేషం. 2006లో బిగ్ బాస్ హిందీ సీజన్ 1 ప్రసారమైంది. ఏకంగా 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. హిందీలో బిగ్ బాస్ గ్రాండ్ సక్సెస్ కావడంతో దేశంలోని ఇతర ప్రాంతీయ భాషలకు ఈ షో వ్యాపించింది. సౌత్ లో కన్నడ భాషలో మొదట ప్రారంభించారు. ఇక తెలుగులో 2017లో ప్రయోగాత్మకంగా బిగ్ బాస్ రియాలిటీ షో ఆరంభించారు.
ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కి నాని హోస్ట్స్ గా వ్యవహరించారు. సీజన్ 3 నుండి హోస్టింగ్ బాధ్యతలు నాగార్జున తీసుకున్నారు. విజయవంతంగా బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ షూటింగ్ కి ఏర్పాట్లు మొదలయ్యాయని సమాచారం.
బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ రీత్యా ఒక్కసారైనా హౌస్లో అడుగుపెట్టాలని ఆశించేవారు ఎందరో. అలాగే తక్కువ సమయంలో డబ్బు, ఫేమ్ తెచ్చిపెట్టే షో ఇది. సామాన్యులు కూడా సెలెబ్రిటీలు అయిపోతారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పేర్లు మారుమ్రోగుతూ ఉంటాయి. అయితే సామాన్యులు కూడా బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చా? అసలు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉంటుంది?. ఆ విషయాలు తెలుసుకుందాం..
సాధారణంగా కంటెస్టెంట్స్ ఎంపిక మూడు విధాలుగా జరుగుతుంది. బుల్లితెర పాప్యులర్ నటులు, కమెడియన్స్, సోషల్ మీడియా స్టార్స్ ని ఒక కేటగిరీగా చూస్తారు. ఇక సినిమా నటులు మరొక కేటగిరీ. సామాన్యులు, బిగ్ బాస్ షోకి వెళ్లాలని ఆసక్తి ఉన్న ఫేమ్ లేని సెలెబ్స్ ఇంకో కేటగిరీ. బుల్లితెర నటులు, కమెడియన్స్, సోషల్ స్టార్స్ తో పాటు సినిమా నటులను బిగ్ బాస్ మేకర్స్ స్వయంగా సంప్రదిస్తారు. వారికి ఫోన్లు చేస్తారు. మీకు ఆసక్తి ఉందా? అని అడుగుతారు. ఆసక్తి ఉంది అంటే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు.
రెండు మూడు దశల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఛానల్ ప్రతినిధులు, షో డైరెక్టర్స్ ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ముఖ్యంగా వారి వ్యక్తిత్వం ఏమిటీ? ఎంటర్టైన్ చేయగలరా? ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలరా? వంటి విషయాలు పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలో సంతృప్తి పరిచిన సెలెబ్స్ తో చివరిగా రెమ్యూనరేషన్ చర్చలు జరుపుతారు. ఒప్పందం కుదిరితే మెడికల్ టెస్ట్స్ చేసి కంటెస్టెంట్ గా ఫైనల్ చేస్తారు.
మూడో కేటగిరిలో బిగ్ బాస్ నిర్వాహకులను స్వయంగా కలిసి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరతారు. ఈ కేటగిరీలో చాలా అప్లికేషన్స్ వస్తాయి. ఈ కేటగిరీ నుండి ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేయవచ్చు. వీరికి రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ కేటగిరిలో ఉన్న సెలెబ్స్ లేదా సామాన్యులు రెమ్యూనరేషన్ పెద్దగా డిమాండ్ చేసే వీలుండదు. అయితే ప్రతి కంటెస్టెంట్ కి చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ ఇస్తారట. ఇక సామాన్యుల కేటగిరీలో గణేష్ అనే ఒక యువకుడు మొదటిసారి సీజన్ 2లో కంటెస్ట్ చేశాడు.
నూతన్ నాయుడు, గంగవ్వ, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్ ఈ లిస్ట్ లో ఉన్నారు. అయితే గణేష్ మాత్రమే ప్యూర్ గా కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టిన వ్యక్తి. గంగవ్వ, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్... సోషల్ మీడియా స్టార్స్. వారికి జనాల్లో ఫేమ్ ఉంది. మీరు సెలెబ్రిటీ కాకపోయినప్పటికీ ఆసక్తి ఉంటే బిగ్ బాస్ మేకర్స్ ని కలిసి అప్లై చేసుకోవచ్చు. వారు నిర్వహించిన పరీక్షల్లో మీరు పాసైతే ఛాన్స్ రావచ్చు. అయితే పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి... అంత సులభం కాదు..