ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి పై కేసు నమోదు అయ్యింది. 10 కోట్ల లంచం, పోన్ ట్యాపింగ్ ఆరోపణల రావడంతో.. కోర్డు ఆదేశాలతో మూర్తిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ సీనియర్ జర్నలిస్ట్ పై ఆరోపణలు చేసింది ఎవరు?
వివాదాస్పద జర్నలిస్ట్ గా గుర్తింపు
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రముఖ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన టీవీ5 మూర్తి మరోసారి వార్తల్లో నిలిచారు. వివాదాస్పద అంశాలపై ఎప్పుడూ సూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు మూర్తి. విషయం ఏదైనా మొహమాటం లేకుండా, ముఖం మీదనే మాట్లాడటం.. సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఇక ఈసారి మాత్రం ఆయన వ్యక్తిగత స్థాయిలో తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నటుడు ధర్మసత్యసాయి మహేష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలోని కూకట్ పల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
గౌతమి, మహేష్ ఇష్యూలో మూర్తి
ఇటీవల గౌతమి చౌదరి అనే మహిళ తన భర్త మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించగా, టీవీ5 మూర్తి గౌతమి పక్షాన నిలబడి, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలు టీవీ5లో ప్రసారమవగా, మహేష్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
మూర్తి పై మహేష్ ఆరోపణలు
మహేష్ వాదన ప్రకారం మూర్తి తన అనుమతి లేకుండా తన ఇంటికి వస్తున్నాడని, తన భార్యతో అనుచిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించాడు. అంతేకాక, తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీ5లో ప్రసారం చేశారని కూడా మహేష్ కోర్టును ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదులో మూర్తి తనను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారని కూడా పేర్కొన్నాడు. దాంతో కోర్టు మూర్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
కేసు నమోదు చేసిన కూకట్ పల్లి పోలీసులు
కోర్టు ఆదేశాల మేరకు కూకట్ పల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, గౌతమి చౌదరిని ఎ-1, టీవీ5 మూర్తిని ఎ-2గా పేర్కొన్నారు. ఈ పరిణామం మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.మహేష్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు. ఆయన, గౌతమి చౌదరి, మూర్తి మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తిసుకుంది. కాకాని వెంకటేశ్వరరావు టీవీలో ప్రసారమైన ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
