కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (సెప్టెంబర్ 25వ తేదీ)లో దీప చంపాలి అనుకునేంత తప్పు నువ్వు ఏం చేశావని జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు దశరథ. దీపను జైలుకు పంపే అవకాశం దక్కలేదు అంటుంది పారు. జ్యోత్న్స చెంప పగలకొడుతుంది సుమిత్ర. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఓ మాట అనే ముందు మా వదిన నా గురించి ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది అనీ కాంచన బాధపడుతుంది. నా బాధ కూడా అదే కాంచనా.. అంటూ శ్రీధర్ స్టార్ట్ చేస్తాడు. సుమిత్ర కుటుంబం గురించి ఆలోచించలేదు. కానీ దీప ఆలోచించొచ్చు కదా అంటాడు. అందుకు కార్తిక్.. చేయని తప్పును దీప ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. కానీ చూసినవాళ్లకు దీపే దశరథను షూట్ చేసినట్లు కనిపిస్తుందని శ్రీధర్ అంటాడు. నేను ఓ తప్పు చేశా. దాన్ని ఒప్పుకున్నా. సుమిత్ర తన తప్పు ఒప్పుకొంది. దీప ఎందుకు ఒప్పుకోకూడదు? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు చేసిన తప్పు ఒప్పుకో దీప అంటాడు శ్రీధర్. 

కోపంతో ఊగిపోయిన కార్తిక్..

నా భార్య, కొడుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నీ వల్లే మొదలయ్యాయి. నీకు నష్టం జరగకుండా ఉండటం కోసం వీళ్లందరి జీవితాలు బలైపోయినా పర్వాలేదా అని శ్రీధర్ గట్టిగా అడుగుతాడు.. వెంటనే ఇక చాలు ఆపు మాస్టారూ అని కార్తిక్ కోపంగా కాంచన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ తీసి నేలకేసి కొడుతాడు. ఇది నా కుటుంబం… నీ సలహాలు, సూచనలు మాకు అవసరం లేదు. ఆయన్ని అత్త పిలిచింది వచ్చారు. జరిగిందంతా చూశారు. ఇక వెళ్లండి అంటూ కోపంగా అంటాడు. 

దశరథ, జ్యోల మధ్య గొడవ

మరోవైపు జ్యో దశరథను ప్రశ్నిస్తుంది. మా అమ్మ తరపున మాట్లాడడానికి ఎవ్వరు లేకపోవడం బాధాకరం అంటుంది. రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశ చూపించి ఇలా ఎందుకు చేశావని మీ అమ్మను ప్రశ్నించమని అంటాడు దశరథ. తప్పు చేసినా ఒప్పుకోనంది ఎవరు? మా మమ్మీనా? దీపనా? నువ్వు చెల్లి కుటుంబం గురించే ఆలోచిస్తున్నావు కానీ.. నీ భార్య గురించి ఆలోచించవా డాడీ? అంటుంది జ్యో. మధ్యలో పారిజాతం కలగజేసుకొని దీప కూడా తప్పు చేసింది కదా ఎందుకు ఒప్పుకోలేదు అంటుంది.

పనిమనిషి మీద ఉన్న నమ్మకం మామీద లేదా?

మీరెందుకు దీపను ప్రశ్నించలేదు డాడీ? ఈ ఇంటి పని మనిషికి ఉన్న విలువ.. ఇంటి కోడలికి లేదా అని జ్యో అంటుంది. తప్పు సరిదిద్దుకోవడానికి నా భార్యకు అవకాశం ఇచ్చాను. కానీ తను ఉపయోగించుకోలేదంటాడు దశరథ. మా మమ్మీకి కూడా ఓ అన్నయ్య ఉంటే మిమ్మల్ని నిలదీసేవాడని జ్యోత్స్న అంటుంది. వయసుకు మించి మాట్లాడుతున్నావు జ్యోత్స్న. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు అని శివన్నారాయణ అంటాడు. అన్నింటికంటే ముందు నువ్వు చేసిన తప్పును ఒప్పుకో అని జ్యోకు షాకిస్తాడు దశరథ.

ఆ రోజు దీప చేతికి గన్ ఎలా వచ్చింది? దీప నిన్ను చంపాలి అనుకుందని ముందే నీకు ఎలా తెలుసు? దీప చంపాలి అనుకునేంత తప్పు నువ్వు ఏం చేశావు? అసలు ఆ తప్పు ఏంటో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు దశరథ.

జ్యో చెంప పగలకొట్టిన సుమిత్ర

దీప గురించి మాట్లాడితే నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నావు. నన్ను దోషిని చేస్తున్నావు. ఈ విషయం దీపను ఎందుకు అడగలేదు? అంటుంది జ్యో. దీపపై నాకు నమ్మకం ఉంది అంటాడు దశరథ. ఓ అనాథ మీద ఉన్న నమ్మకం.. నీ కన్నకూతురి మీద లేదు. నిన్ను చూస్తుంటే మూర్ఖుడిలాగే కనిపిస్తున్నావ్ డాడీ అని జ్యో అనగానే సుమిత్ర వచ్చి జ్యోత్న్స చెంప పగలకొడుతుంది. హద్దుల్లో ఉండమని హెచ్చరిస్తుంది. కూతురి తరపున భర్తకు క్షమాపణ చెప్తుంది. 

జ్యోత్న్స చెంపకు వెన్న రాస్తుంది పారిజాతం. కాశీ విషయంలో తాను తప్పు చేశానని పారును కూల్ చేసేందుకు ప్రయత్నిస్తుంది జ్యో. మీ అమ్మ ఇచ్చిన ట్విస్ట్ చూసిన తర్వాత దీప ఓడిపోవడమే మనకు ప్లస్ అనిపించింది. దీప ఒప్పుకుంటే జైలుకు పంపే అవకాశం ఉండేది. కానీ కార్తీక్ అడ్డుకున్నాడని పారు అంటుంది. మరోవైపు సుమిత్ర మాటలను గుర్తు చేసుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తీక్ వచ్చి దీపను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. మా నాన్నకు బుల్లెట్ తగిలిన రోజు నువ్వు అక్కడ లేకపోయి ఉంటే నేనే షూట్ చేశానని నమ్మేవాడివా? అని దీప కార్తిక్ ను అడుగుతుంది. 

అందుకు కార్తిక్.. చిన్నప్పుడు నన్ను కాపాడావు. ఆ తర్వాత మా అత్తను కాపాడావు. మంచి చేయడమే దీప వ్యక్తిత్వం. కానీ నీ ఆవేశాన్ని జ్యోత్న్న అవకాశంగా మార్చుకుంది. ఇప్పటికీ ఆ బుల్లెట్ ఏ గన్ లో నుంచి వచ్చిందో తెలియలేదు. నువ్వు నిర్దోషివని మామయ్య కూడా నమ్ముతున్నాడు. కానీ జ్యోత్స్న, పారు కలిసి అత్తయ్యను నమ్మకుండా చేసున్నారని అంటాడు కార్తిక్. నువ్వు ఏ తప్పు చేయలేదని త్వరలోనే అందరికీ తెలుస్తుందని అంటాడు. 

దీప వల్లే ఇదంతా

మరోవైపు కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ శ్రీధర్ బాధపడతుంటాడు. ఎందుకు బాధపడుతున్నారని కావేరీ, స్వప్న అడుగుతారు. కార్తిక్ జీవితం ఇలా కావడానికి దీపే కారణమని శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.