చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన కుమ్మరి బాలు అనే యువకుడు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన కుమ్మరి బాలు అనే యువకుడు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. బుల్లితెరపై టివి సీరియల్స్ లో చిన్న చిన్న వేషాలు వేస్తూ నటుడిగా ఎదుగుతున్నాడు. 

ఈ సమయంలో బాలుని విధిరాత వెంటాడింది. రోడ్డు ప్రమాదానికి గురైన బాలు దుర్మరణం చెందారు. ఇటీవల బాలు స్నేహితుడి వివాహం కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామంలో జరిగింది. తన స్నేహితుడి పెళ్ళికి బాలు హైదరాబాద్ నుంచి బైక్ లో వచ్చి హాజరయ్యాడు. 

తిరిగి వెళుతుండగా యాదాద్రి సమీపంలో బైక్ అదుపు తప్పింది. దీనితో వేగంగా పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టడంతో బాలు అక్కడికక్కడే మృతి చెందారు. బాలు మరణించడంతో అతడి గ్రామస్థులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. బాలుకి వివాహం జరిగి భార్య కూడా ఉంది. ఈ నెల 19న ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

ఎంతో భవిష్యత్తు ఉన్న బాలు ఇలా మరణించడంతో సన్నిహితులు జీర్ణించుకోలేకున్నారు. అనేక తెలుగు టివి సీరియల్స్ లో బాలు చిన్న చిన్న పాత్రలో నటించారు.