ప్రముఖ టెలివిజన్ నటుడు లోబో అలియాస్ ఖయూమ్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ఇద్దరు మృతికి ఆయన కారణం అయ్యాడన్న అభియోగంపై లోబోకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఇంతకీ లోబో చేసిన నేరం ఏంటి?

ప్రముఖ టెలివిజన్ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది పాటు జైలు శిక్షపడింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతికి కారణమైన కేసులో జనగామ కోర్టు గురువారం (ఆగస్టు 28) తీర్పును వెలువరించింది. ఏడాది కాలం జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ కేసు 2018 మే 21న చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించినది.

వివరాల్లోకి వెళితే, టీవీ ఛానెల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం ఖయూమ్ అలియాస్ లోబో నేతృత్వంలోని బృందం వరంగల్ జిల్లాలోని వేరు వేరు ప్రదేశాలు సందర్శించింది. వేయిస్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ ముగించుకొని, వ‌రంగ‌ల్ నుండి హైద‌రాబాద్‌కు తిరిగి వస్తుండగా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

లోబో డ్రైవ్ చేస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి మరణించారు. కారు బోల్తా పడడంతో లోబోతో పాటు బృంద సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు రఘునాథపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు.

పూర్తి విచారణ అనంతరం కోర్టు లోబోపై నేరం నిరూపితమైందని తేల్చింది. దీంతో కోర్టు ఆయనకు ఏడాది సాధారణ కారాగార శిక్షతో పాటు 12,500 జరిమానా విధించింది. ఈ విషయాన్ని రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ మీడియాకు తెలిపారు.

టీవీ రంగంలో ‘బిగ్ బాస్’ షోతో ప్రాచుర్యం పొందిన లోబో, పలు రియాలిటీ షోలు, ఈవెంట్లలో తో పాపులర్ అయ్యారు. బుల్లితెరపై రకరకాల కార్యక్రమాల్లో కనిపించిన ఆయన, ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటూ.. అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నాడు. ఆయనపై ఉన్న ఈ కేసులో కోర్టు తీర్పు సంచలనంగా మారింది. రీసెంట్ గా ఓ వ్యక్తిగత ఘటనలతోనూ వార్తల్లో నిలిచిన లోబోకు ఈ తీర్పు న్యాయపరంగా ఒక పెద్ద మలుపుగా మారింది.