సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. అయితే ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అన్ని సినిమాలకు జరుగుతూనే ఉంటాయి. ఈ వేడుకలకు స్టార్ సెలబ్రిటీలను అతిథులుగా పిలవడం, వారితో స్పీచ్ లు ఇప్పించడం చేస్తుంటారు.

తాజాగా నటి మంచు లక్ష్మి కూడా సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' సినిమా జూలై 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేష్, రానా లతో పాటు మంచు లక్ష్మీ కూడా హాజరైంది.

ఈవెంట్ లో భాగంగా యాంకర్ మంచి లక్ష్మీ చేతికి మైక్ ఇచ్చింది. అంతే.. తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకోవాలనే తపనతో పప్పులో కాలేసింది. 'ఓ బేబీ' సినిమాలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను పొగుడుతూ 'మీరు నటించిన జంబలకిడి పంబ సినిమా వెయ్యిసార్లు చూసి ఉంటాం.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం' అంటూ నోరు జారింది. నిజానికి 'జంబలకిడి పంబ' సినిమాలో హీరో నరేష్.. కానీ మంచు లక్ష్మీ.. రాజేంద్రప్రసాద్ అని స్టేజ్ మీద చెప్పడంతో ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

తెలుసుకొని స్పీచ్ లు ఇవ్వాలంటూ మంచు లక్ష్మీకి సలహాలు ఇస్తున్నారు. నటి శ్రీరెడ్డి కూడా మంచు లక్ష్మీకి పంచ్ వేసింది. 'ఇంగ్లీష్ పుత్రీ' అంటూ మంచు లక్ష్మీని సంబోధిస్తూ.. ''మంచులక్ష్మి జీ.. జంబలకిడిపంబ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా... పొగడకపోయినా పర్లేదు అవమానించకమ్మా'అంటూ పోస్ట్ పెట్టింది.