ఒక సినిమాకు అనుకున్న టైటిల్ రకరకాల కారణాలతో పెట్టడం కుదరదు. అయితే అప్పటికే ఆ టైటిల్ పాపులర్ అయితే ..దాన్ని వేరే సినిమావాళ్లు వాడటం జరుగుతూంటుంది. అలాంటిదే ..ఇప్పుడు సత్యదేవ్ తాజా చిత్రానికి జరిగింది. అప్పట్లో నితిన్ తో త్రివిక్రమ్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేసారు. ఆ సినిమాకు  ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ అనుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో ఆ టైటిల్ వద్దనుకుని ప్రక్కన పెట్టేసి..ఛల్ మోహన్ రంగా అనే టైటిల్ తో ముందుకు వెళ్లారు. దాంతో ఆ టైటిల్ అలా ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి ఆ టైటిల్ ని సత్యదేవ్ చిత్రానికి ఉపయోగిస్తున్నారు.

 సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతోన్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడ మూవీ ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ తాజ్ కృష్ణా‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌‌తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. 

నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. నాగశేఖర్ సమర్పణలో.. నాగశేఖర్, భావన రవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో వరుసగా హీరో సత్యదేవ్‌ నటించిన 47డేస్‌తో పాటు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలు నేరుగా ఓటీటీలో త్వరలో విడుదల అయ్యాయి. దీంతో సత్యదేవ్‌ను ఓటీటీ హీరోగా అని పిలుచుకుంటున్నారు టాలీవుడ్‌ జనం.