డైరక్టర్స్ కు హీరోలు కొరత తెలుగు పరిశ్రమలో నడుస్తోంది. ఎంత పెద్ద హిట్ కొట్టిన డైరక్టర్ అయినా స్టార్ హీరో డేట్స్ కావాలంటే ఖాళీగా కూర్చుని వెయిట్ చెయ్యాల్సిందే. అయితే స్టార్ డైరక్టర్స్ పరిస్దితి ఏమిటి అంటే..వాళ్లు సైతం హీరోలు ఓకే చేసినా డేట్స్ ఇచ్చేదాకా వెయిటింగ్ మోడ్ లోనే ఉండాలి.  ఈ సంవత్సరం ప్రారంభంలో అల వైకుంఠపురములోతో పెద్ద సక్సెస్ ని చూసిన మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఎన్టీఆర్‌తో సినిమాని ప్రకటించినప్పటికీ డేట్స్ ఫైనల్ కాలేదు.

 ఎన్టీఆర్  ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నందున ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేసరికి ఇంకా చాలా సమయమే పట్టనుంది. మరో ప్రక్క ఈ మధ్యన త్రివిక్రమ్‌తో మూవీ ఉండబోతున్నట్లు మహేష్‌ బాబు ఓ హింట్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం మహేష్‌ సర్కారు వారి పాట పూర్తయ్యేదాకా వెయిట్ చేయాలి. దాంతో  ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. ఈ క్రమంలో త్రివిక్రమ్ వేరే హీరోను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో గ్యాప్ లో నితిన్ తో అ..ఆ సినిమా తీసి హిట్ కొట్టినట్లే ఇప్పుడు రామ్ తోనూ ఓ సినిమా చేయబోతున్నారట. ఎప్పటినుంచో రామ్ తో సినిమా చెయ్యాల్సిన కమిట్మెంట్ త్రివిక్రమ్ కు ఉంది.

 రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ..త్రివిక్రమ్ కు కెరీర్ ప్రారంభంలో ఎంకరేజ్ చేసిన వారిలో ఒకరు. అయినా సరే ఇన్నాళ్లుగా రామ్ తో సినిమా చేయటం కుదరలేదు. సర్లే ఇప్పుడు గ్యాప్ ఉంది కదా అని లాగించేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో  రామ్‌కు ఇటీవల త్రివిక్రమ్ ఒక కథను చెప్పగా.. అది ఆ నటుడికి బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఓకే చెప్పారట. లాక్‌డౌన్‌ కంటే ముందే రెడ్‌ మూవీని పూర్తి చేసుకున్న రామ్.. ఇంతవరకు మరో దర్శకుడికి ఓకే చెప్పలేదు. ఇక తాజాగా త్రివిక్రమ్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మరో కొత్త కాంబోను టాలీవుడ్‌ ప్రేక్షకులకు చూసే అవకాశం వస్తుంది.