నిన్న విడుదలైన  వకీల్‌సాబ్ టీజర్ తో పవన్ కళ్యాణ్‌ అదరగొట్టారు. తన మార్కు పంచ్ లతో ఆయన చెలరేగిపోయారు. కాగా నేడు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ పవన్ నుండి వచ్చింది. రానాతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.  

కాగా ఈ మూవీ టీమ్ లోకి దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంటర్ అయ్యారు. అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ కి  స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం నేడు అధికారిక ప్రకటన చేశారు. దీనిపై గతంలోనే సమాచారం ఉన్నప్పటికీ నేడు అధికారికంగా ధృవీకరించారు. 

ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా... పవన్ సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.