Asianet News TeluguAsianet News Telugu

Sirivennela Seetharama Sastry Death: తెలుగు ప్రేక్షకుల స్థాయి పెంచిన కవి.. త్రివిక్రమ్ ఎమోషనల్

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై తెలుగు చిత్ర పరిశ్రమ, సాహితీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు విషాదంలో మునిగిపోయారు. తెలుగు సినిమాకు తీరని లోటు అంటూ వాపోయారు. ఆయన ఉన్నతిని చాలా మంది ఇప్పటికీ గుర్తించనే లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భావోద్వేగంతో చెప్పిన మాటలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడని, తెలుగు ప్రేక్షకుల స్థాయిని పెంచిన కవి అని త్రివిక్రమ్ పొగడ్తలు కురిపించారు.
 

trivikram srinivas emotional speech on sirivenneal seetharama sastry
Author
Hyderabad, First Published Nov 30, 2021, 6:12 PM IST

హైదరాబాద్: సిరివెన్నెల చిత్రంలో ‘ప్రాగ్దిశ వేణియపైన’ వంటి అద్భుతమైన పాట రాసి తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించారు సీతారామ శాస్త్రి(Sirivennela Seetharama Sastry). ఆ చిత్రం పేరే ఆయన పేరుకు ముందు చేరింది. ఆయన చేసిన రచనలు ఇప్పటికీ తెలుగు ప్రజల్లో ఎక్కడో చోటా నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అంతటి సుప్రసిద్ధ సినీ గేయ రచయిత(Lyricist) కన్నుమూతపై తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాదు.. తెలుగు ప్రజలూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాకు ఆయన లోటు తీరలేనిదని సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్(Director Trivikram) భావోద్వేగంగా చెప్పిన మాటలను ఇప్పుడు మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నారు.

ఓ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భావోద్వేగంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడారు. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని, లోకం నిద్రపోయాక మేలుకునే కవి అంటూ పేర్కొన్నారు. ఆయన తన పాటలతో అర్ధరాత్రి ప్రపంచంపై వేటకు బయల్దేరతాడని అన్నారు. అందరి వద్దకు చేరి ప్రశ్నిస్తారని, నిలదీస్తారని, ఓటమిని అంగీకరించవద్దని హెచ్చరిస్తారని వివరించారు. ప్రజల మధ్యకు వెళ్లాలంటే వారందరికీ అర్థమయ్యే గీతాలే రాయాలనేమీ లేదని, ఆ పాటలను అర్థం చేసుకునే తపన కలిగించే పాటలనూ రాయవచ్చునని అన్నారు. సీతారామ శాస్త్రి రెండో కోవలోనూ పాటలు రాశారని వివరించారు. అద్భుతమైన పదాల కూర్పుతో అనిర్వచనీయమైన అర్థాలతో ఆయన రాసిన పాటలు తెలుగు ప్రేక్షకుల స్థాయినే పెంచేశాయని అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన కేవలం తెలుగు సినీ పరిశ్రమకే పరిమితం కావడం ఆయన దురదృష్టమని, తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజల అదృష్టమని అన్నారు. ఆయన పోయెట్రీ గురించి మాట్లాడే శక్తి తనకు లేదని తెలిపారు. ఎందుకంటే ఆయన కవిత్వం గురించి మాట్లాడటానికి కావాల్సిన పదాలు తన దగ్గర లేవని వివరించారు.

Also Read: Sirivennela Seetharama Sastry Death: పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు..

ఎందరో గొప్ప గొప్ప కవులు తెలుగు చిత్ర పరిశ్రమకే అంకితమై తమ స్థాయిని తగ్గించుకున్నారని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. దేవులపల్లి, దాశరథి, ఇంకెందరో కవులు ఇక్కడికే పరిమితం అయ్యారని, వారికి తగిన గుర్తింపు లభించలేకపోయిందని తెలిపారు. సిరివెన్నె సీతారామ శాస్త్రి కూడా అంతర్జాతీయ స్థాయి రచయిత అని, అలాంటి రచయిత కేవలం తెలుగు చిత్రపరిశ్రమకే పరిమితం కావడంపై తాను కలత చెందుతున్నారని చెప్పారు. డ్యూయెట్ సాంగ్స్‌లోనూ ఆయన తన కవి హృదయాన్ని కోల్పోలేదని, సాహసవంతమైన పదాలతో దర్శక నిర్మాతలను మెప్పించగలిగే గట్స్ సిరివెన్నెలకే ఉన్నాయని అన్నారు. హీరోల స్టార్‌డమ్, దర్శకుల తెలియినతనం, ప్రేక్షకుల అర్థంకాని వ్యవహారం వంటి అనేక పరిమితుల్లోనూ ఆయన రాజీ పడకుండా తన సాహిత్య ఉద్యమాన్ని కొనసాగించారని తెలిపారు.

Also Read: Sirivennela Seetharama Sastry Death: చైతన్యాన్ని తట్టిలేపే సిరివెన్నెల టాప్‌ సాంగ్స్..

గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘సిరివెన్నెల’ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios