బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ కలిసింది. అల్లు అర్జున్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది.
త్రివిక్రమ్ మహేష్ మూవీకి సిద్ధం అవుతుంటే... అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ అల వైకుంఠపురం లో కాంబో అనుకోకుండా కలుసుకున్నారు. అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే అవకాశం త్రివిక్రమ్ కి దక్కింది. వివరాల్లోకి వెళితే పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో అనేక వ్యాపార సంస్థలు బన్నీ వెనుక బడుతున్నాయి. తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్ లో అల్లు అర్జున్ నేడు పాల్గొంటున్నారు. హైదరాబాద్ ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఈ యాడ్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారు. అలా త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది.
ఈ షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ఇది తెరకెక్కింది. మరోవైపు ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి పుష్ప 2 సీక్వెల్ ప్రారంభం కానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ. 350 కోట్లని సమాచారం.
ఇక మహేష్ 28వ చిత్ర దర్శకుడిగా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాగా ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో పాటు విదేశాల్లో ఉన్నారు. ఆయన త్వరలో ట్రిప్ ముగించుకొని ఇండియాకు రానున్నారు. మహేష్ వచ్చిన వెంటనే షూట్ లో పాల్గొంటారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట.
