స్టార్ హీరో ప్రభాస్ ప్రయాణిస్తున్న కారుకు హైదరాబాద్ పోలీసులు చలానా విధించారన్న కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన పీఆర్ టీం స్పందించారు. దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఏప్రిల్ 16 శనివారం హీరో ప్రభాస్ (prabhas) కారుకి చలానా విధించినట్లు మీడియాలు వరుస కథనాలు వెలువడ్డాయి.హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ కారుకి ఫైన్ విధించారు. ఎంపీ స్టిక్కర్, నంబర్ ప్లేట్, బ్లాక్ ఫిల్మ్ వుండటంతో రూ.1450 ఫైన్ వేశారనేది సదరు కథనాల సారాంశం. ప్రభాస్ కున్న ఇమేజ్ రీత్యా ఈ న్యూస్ మీడియాలో వైరల్ అయ్యింది. వరుస కథనాల నేపథ్యంలో ప్రభాస్ పీఆర్ టీమ్ స్పందించారు. మీడియాకు ఓ సందేశం విడుదల చేశారు.
ఈ రోజు హైద్రాబాద్ రోడ్ నెంబర్ 36 లో ప్రభాస్ గారి కార్ కి హైదరాబాద్ పోలీస్ వారు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కార్ కి, హీరో ప్రభాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదని తెలియచేస్తున్నాం. దయచేసి గమనించగలరు... అంటూ వివరణ ఇచ్చారు. నిబంధలకు విరుద్ధంగా ఉన్న ఆ కారు ప్రభాస్ కి చెందినది కాదని, ఆ సంఘటనతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం లేదని రుజువైంది.
ఈ మధ్య వరుసగా టాలీవుడ్ ప్రముఖులు ఈ తరహా కేసుల్లో జరిమానాలు చెల్లించారు. కొద్దిరోజుల క్రితం .. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)కారుకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. చైతన్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న నేపథ్యంలో ఆయనకు ఫైన్ వేశారు. ఇదే తరహా కేసులో దర్శకుడు త్రివిక్రమ్ ట్రాఫిక్ పోలీసులు చలానా చెల్లించారు. ఈక్రమంలో ప్రభాస్ కారుకు ఫైన్ విధించారన్న వార్త ప్రముఖంగా ప్రచారమైంది.
