దొంగతనం కేసులో ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా సింహాచలానికి చెందిన కులశేఖర్ టాలీవుడ్‌లో ప్రముఖ గేయ రచయితల్లో ఒకరు.. సుమారు వందకు పైగా సినిమాలకు పాటలు రాశారు..

అయితే కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన వ్యసనాలకు బానిసయ్యాడు... దీంతో కుటుంబసభ్యులు సైతం ఆయన్ను పట్టించుకోకపోవడంతో.. అయినవారికి కూడా దూరమయ్యాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పాట బ్రాహ్మణులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరంగా పెట్టింది.

దీంతో బ్రాహ్మణుల మీద కులశేఖర్ ద్వేషాన్ని పెంచుకున్నాడు.. ఈ క్రమంలో ఆలయాలను, పూజారులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు.

ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు కులశేఖర్‌ను అరెస్ట్ చేశారు..

అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన 10 సెల్‌ఫోన్లు, రూ.45 వేల విలువైన బ్యాగులు, డెబిట్, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆయన్ను రిమాండ్‌కు తరలించారు. మరోవైపు కులశేఖర్ అరెస్ట్‌తో టాలీవుడ్ షాక్‌కు గురైంది.