రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించిన హీరోయిన్‌ పూర్ణకు సోషల్ మీడియా వేదింపులు ఎదురయ్యాయి. నలుగురు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తనను వేదిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్ డౌన్‌ కారణంగా మూడు నెలలుగా ఆమె స్వస్థలం కేరళలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే పలు మలయాళ సినిమాలకు అంగీకరించిన ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ నేపథ్యంలో ఆమెకు ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌తో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా ఆమె పోలీసులకు తెలిపింది. కొద్ది రోజులుగా తన సోషల్  మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్‌ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది. 

వెంటనే స్పందించిన సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిందితులు బెంగళురు వారని తేలింది. దీంతో బెంగళూరు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు శరత్‌, అష్రఫ్‌, రఫీజ్, రమేష్‌గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి పనులకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. కొంత మంది మహిళలను, స్టూడెంట్స్‌ను వేదించిన కేసులు వారి మీద ఉన్నట్టుగా గుర్తించారు.  పూర్ణ అసలు పేరు కామ్నా కాసిమ్‌.