విజయ్‌ హీరోగా దీపావళికి విడుదలైన ‘సర్కార్‌’ చిత్రం వివాదాల నుంచి ఇంకా బయిటపడలేదు. ఈ సినిమాలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించినందుకుగాను క్షమాపణ  కోరాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్‌ చేయగా... ఆ పని చేయనని మురుగదాస్‌ తేల్చిచెప్పారు. ఆయనకు కమల్ హాసన్ ట్వీట్ చేసి సపోర్ట్ ఇచ్చారు. 

‘సర్కార్‌’ సినిమాలో ప్రజలకు  పంపిణీ చేసిన ఉచిత వస్తువులను తగులబెడుతున్న సీన్స్  తొలగించాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల ముందు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, మురుగదాస్‌కి వ్యతిరేకంగా దేవరాజ్‌ అనే వ్యక్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై సాలిగ్రామంలో ఉన్న మురుగదాస్‌ ఇంటికి విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆయన ఇంట్లో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న సందేహంతో ముందస్తు బెయిల్‌ కోరుతూ మురుగదాస్‌ మద్రాస్‌ హైకోర్టుని ఆశ్రయించారు. 

ఆ పిటీసన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి నవంబర్‌ 27వ తేదీ వరకు మురుగదాస్‌ను అరెస్టు చేయకూడదని స్టే విధించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ మళ్లీ మంగళవారం విచారణకు రాగా.. మురుగదాస్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయకూడదని, ప్రభుత్వ పథకాలను విమర్శించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అంతేకాకుండా, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో ప్రభుత్వాన్ని విమర్శించనని రాతపూర్వక హామీ ఇవ్వాలని ప్రభుత్వం తరపున లాయిర్ డిమాండ్‌ చేశారు. 

ఇందుకు బదులివ్వాలని హైకోర్టు మురుగదాస్‌ను ఆదేశించగా, బుధవారం జరిగిన విచారణలో మురుగదాస్‌ తరపు లాయిర్  హాజరై... ప్రభుత్వాన్ని విమర్శించబోమని తమ క్లైంట్‌ హామీ ఇవ్వరని, సినిమాల్లో సీన్స్  తన భావ స్వాతంత్ర్యానికి సంబంధించినవని, అందువల్ల క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని మురుగదాస్‌ పేర్కొన్నట్లు తెలిపారు. వాదప్రతివాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఈ కేసును డిసెంబర్‌ 13కు వాయిదా వేశారు. అలాగే అప్పటివరకు మురుగదాస్‌ని అరెస్టు చేయకూడదని కూడా ఆదేశాలు జారీచేశారు.