యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయన శరీరం నీలం రంగులోకి మారిందని వైద్యులు వెల్లడించగా అందుకు కారణాలు ఏమిటో ఎక్స్పర్ట్స్ తెలియజేశారు.
తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతోంది. గుండెపోటుకు గురైన తారకరత్నను కుప్పం పీఈఎస్ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో ఉంచి వైద్యం అందించారు. అనంతరం బెంగుళూరు నుండి ప్రత్యేక వైద్య బృందాన్ని పిలిపించారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్ తారకరత్న ఆరోగ్యం పర్యవేక్షించారు. గత రాత్రి బెంగుళూరు ఆసుపత్రికి తరలించడం అనివార్యమని వైద్యులు భావించారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కుప్పం చేరుకున్న తర్వాత ఆమె అనుమతితో తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడమైంది.
ప్రస్తుతం తారకరత్నకు బెంగుళూరులో చికిత్స జరుగుతుంది. జనవరి 27 శుక్రవారం నారా లోకేష్ కుప్పం వేదికగా యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర మొదలైన కొద్దిసేపటికే తారకరత్న అనారోగ్యం బారిన పడ్డారు. జనాల మధ్య నడుస్తూ తారకరత్న కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న తారకరత్న ఆసుపత్రికి చేరుకొనేసరి క్రిటికల్ కండీషన్ కి చేరుకున్నారు.
ఆయన పల్స్ రేటు పడిపోయిందని, శరీరం నీలం రంగులోకి మారిందని వైద్యులు వెల్లడించారు. సీపీఆర్ చేసిన అనంతరం 45 నిమిషాలకు పల్స్ రేటు మెరుగైందన్నారు. ఈ క్రమంలో తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్స్ కారణం తెలియజేశారు. తారకరత్న రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంది. అలాగే గుండె కొట్టుకోవడం నెమ్మదించినప్పుడు శరీర భాగాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది.
రక్తం చేరని కాలి, చేతి వేళ్ళతో పాటు కొన్ని శరీర భాగాలు నీలం రంగులోకి మారతాయని చెప్పుకొచ్చారు. తారకరత్న గుండెలో 90 శాతం బ్లాక్స్ ఏర్పడ్డాయి. దీని వలన రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడింది. అదే హార్ట్ అటాక్ కి కారణమైంది. శరీర భాగాలకు గుండె నుండి రక్తం అందని కారణంగా నీలం రంగులోకి మారిందని వెల్లడించారు. కాగా నేడు చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరు వెళ్లనున్నారట.
