Samantha and Amala Akkineni fire on Konda Surekha : నాగచైతన్య-సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కాంగ్రెస్ నాయ‌కురాలు, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొండ సురేఖ కామెంట్స్ పై స‌మంత‌తో పాటు నాగార్జున కుటుంబం తీవ్రంగా స్పందించారు. అలాగే, కొండా సురేఖ‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. 

Samantha and Amala Akkineni fire on Konda Surekha : కాంగ్రెస్ నాయ‌కురాలు, మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ స‌మంత‌-నాగ‌చైత‌న్య‌ల విడాకుల‌కు అంశాన్ని లాగుతూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. నాగ చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోవ‌డానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) కార‌ణ‌మంటూ ఆరోపించారు. ఎన్ క‌న్వెన్ష‌న్ ర‌క్ష‌ణ కోసం స‌మంత‌ను త‌న వ‌ద్ద‌కు పంపాల‌ని కేటీఆర్ కోర‌గా, దీనికి స‌మంత నో చెప్పార‌నీ, ఆ త‌ర్వాత నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకున్నార‌ని కామెంట్ చేశారు. అలాగే, కేటీఆర్ డ్ర‌గ్స్ తీసుకున్నార‌నీ, సినిమా వాళ్ల‌కు కూడా అల‌వాటు చేశార‌ని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ కార‌ణంగా ఎంతో మంది సినిమా వాళ్లు బ‌ల‌య్యార‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డంతో తీవ్ర దుమారం రేగుతోంది.

ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయ‌కుండా ఉండేందుకు బదులుగా సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశార‌నీ, సమంతని తన వద్దకు వెళ్లమని నాగార్జున కోరగా ఆమె వెళ్లేందుకు నిరాకరించిందని కొండ సురేఖ వ్యాఖ్యానించారు. దీని కార‌ణంగా నాగ చైత‌న్య‌-స‌మంత విడాకులు తీసుకున్నార‌ని ఆమె ఆరోపించారు. ఈ రోజు స‌మంత జీవితం అన్యాయం కావ‌డానికి 100 శాతం కేటీఆర్ కార‌ణమ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సినిమా వాళ్ల ఫోన్ ల‌ను ట్యాపింగ్ చేసి, ఆ రికార్డుల‌తో వారిని బెదిరించి చాలా మంది హీరోయిన్ల‌ను లొంగ‌దీసుకున్నాడ‌ని ఆరోపించారు. 

కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స‌మంత ఎమ‌న్నారంటే? 

నాగ చైత‌న్య‌-స‌మంత‌ల విడాకుల‌కు కేటీఆర్ కార‌ణం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ వీడియోలు వైర‌ల్ గా మారాయి. తాజాగా న‌టి సమంత స్పందిస్తూ.. తాను ఎప్పుడూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌నీ, సాటి మ‌హిళ‌గా త‌త‌ను చిన్న‌చూపు చూడ‌వ‌ద్ద‌నీ, ఇత‌రుల వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడేట‌ప్పుడు బాత్య‌త‌, గౌర‌వం ఉండాలంటూ కొండా సురేఖ‌కు స‌మంత చుర‌క‌లంటించారు. 

ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించిన స‌మంత‌.. "స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి గ్లామరస్ ఇండ‌స్ట్రీలో చాలా ధైర్యం, బలం కావాలి. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి & ప్రేమ నుంచి బ‌య‌ట‌పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలి. కొండా సురేఖ గారూ.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను, దయచేసి చిన్నచూపు చూడకండి" అని స‌మంత‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. 

అలాగే, తన విడాకులను తన వ్యక్తిగత విషయంగా పేర్కొంటూ.. "ఒక మంత్రిగా మీ మాటలు గణనీయమైన బరువును కలిగి ఉన్నాయని మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత విష‌యంలో బాధ్యత, గౌరవం క‌లిగి ఉండాలి. నా విడాకులు వ్యక్తిగత విషయం. మీరు దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాల‌ని కోరుతున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారంతో.. స్నేహపూర్వకంగా జ‌రిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర లేదు" అని స‌మంత పేర్కొంది. 

మహిళా మంత్రి పిశాచిలాగా మారింది.. సిగ్గుచేటు ఇది : అక్కినేని అమ‌ల 

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన‌ అక్కినేని అమల ఆమెపై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక మహిళా మంత్రి పిశాచిలాగా మారిందని తప్పుబట్టిన అమల.. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సభ్యత, సంస్కారం ఉన్న కాంగ్రెస్ నాయకులను అదుపులో పెట్టాలనీ, త‌మ కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పించాల‌ని డిమాండ్ చేశారు. 

ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్టులో అమ‌ల స్పందిస్తూ.. "ఒక మహిళా మంత్రి పిశాచిలాగా మారి, త‌ప్పుడు కల్పనల ఆరోపణలను సృష్టించి, మంచి పౌరులను రాజకీయ యుద్ధానికి ఇంధనంగా మలచుకోవడం విని షాక్ కు గురయ్యాను. మేడమ్ మినిస్టర్ గారూ, సిగ్గు, నిజం అనేవి ఏ మాత్రం లేకుండా నా భర్త గురించి నీచమైన కధలు చెప్పడం నిజంగా ఇది సిగ్గుచేటు. నాయకులు బురదలో కూరుకుపోయి నేరస్థుల్లా ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ, మీకు మానవ మర్యాదలపై నమ్మకం ఉంటే, దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో పెట్టండి. మీ మంత్రి నా కుటుంబానికి క్షమాపణ చెప్పి ఆమె విషపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చేయండి. ఈ దేశ పౌరులను రక్షించండి" అంటూ ఘాటుగా స్పందించారు.

Scroll to load tweet…


కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

తనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపారు. "తాను మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారనీ, కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్కి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో" కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని మండిప‌డ్డారు.

ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమ‌న్నారు. త‌న‌కు సంబంధంలేని విష‌యాల‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Scroll to load tweet…