టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కమెడియన్ ప్రియదర్శి కలిసి హైదరాబాద్ పోలీసులను ఫూల్స్ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఈ ఇద్దరు నటులపై విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ హీరోగా 'నిను వీడని నీడను నేనే' అనే సినిమా తెరకెక్కింది.

ఈ వారంలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్, ప్రియదర్శిలు  చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నటుడు ప్రియదర్శి ట్విట్టర్ లో తన బైక్ చోరీ అయిందంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ విషయం హైదరాబాద్ పోలీసుల వరకు వెళ్లింది.

వెంటనే స్పందించిన పోలీసులు లొకేషన్ ఎక్కడో చెప్పమని అడిగారు. దాంతో షాక్ అయిన ప్రియదర్శి తన ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశారు. హీరోగా సందీప్ కిషన్ వెంటనే రియాక్ట్ అయి క్షమాపణలు చెప్పాడు. ప్రియదర్శి బైక్ ఎవరో కొట్టేశారని చెప్పడం అంతా అబద్దమట.

ప్రియదర్శి తన స్నేహితుడు సందీప్ కిషన్ నటించిన 'నిను వీడను నీడను నేనే' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన బైక్ పోయిందని చెప్పాడు. ఇంతకీ ఆ బైక్ కి సినిమాకి ఉన్న రిలేషన్ ఏంటంటే.. సినిమాలో ఈ బైక్ కనిపిస్తుందట.

దీంతో బైక్ ని వాడుకొని ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. కానీ అది కాస్త పక్కదారి పట్టడంతో వెంటనే క్షమాపణలు చెప్పేశారు. ఇలాంటి విషయాల్లో కామెడీ ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు!