ప్రభాస్ ఫ్యాన్స్ వేధిస్తున్నారు... ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఆరోపణలు!
ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధింపులకు పాల్పడవుతున్నారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆరోపణలు చేశారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ చిత్రం ఉందని ఆరోపణలు వినిపించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రాపగాండాలో భాగంగా ది కాశ్మీర్ ఫైల్స్ తెరకెక్కించారని ఓ వర్గం గట్టినా నమ్ముతున్నారు. ఈ వివాదాస్పద చిత్రాన్ని గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం వివాదాస్పదమైంది. అలాగే జాతీయ సమైక్యత విభాగంలో నేషనల్ అవార్డు ప్రకటించడాన్ని కొందరు వ్యతిరేకించారు.
కాగా వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పలుమార్లు అనుచిత కామెంట్స్ చేశాడు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో రాధే శ్యామ్ చిత్రాన్ని దెబ్బ తీశాను. ది వాక్సిన్ వార్ మూవీతో సలార్ ని ప్లాప్ చేస్తానని వివేక్ అన్నట్లు సమాచారం. ఆదిపురుష్ మూవీపై కూడా వివేక్ అగ్నిహోత్రి అనుచిత కామెంట్స్ చేశాడు. ఎవరిని పడితే వాళ్ళను రాముడు అంటే జనాలు అంగీకరించరు. కనీస పరిజ్ఞానం లేకుండా ఆదిపురుష్ తెరకెక్కించారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.
ది వాక్సిన్ వార్ సెప్టెంబర్ 28న విడులవుతుంది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ వివేక్ ఆరోపించాడు. తనతో పాటు తన కూతురిని అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారని ఆయన అన్నారు. సడన్ గా ప్రభాస్ ఫ్యాన్స్ మీద వివేక్ అగ్నిహోత్రి ఆరోపణలు చేయడం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు భావిస్తున్నారు. ది వాక్సిన్ వార్ చిత్రానికి ప్రచారం తెచ్చుకోవడానికి ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఆరోపణలు చేస్తున్నాడనే వాదన వినిపిస్తోంది.