బడా తెలుగు నిర్మాత దిల్‌రాజుకి నిర్మాతల మండలి పెద్ద షాకిచ్చింది. సంక్రాంతి థియేటర్ల విషయంలో నిర్మాతల మండలి ఊహించని షాకివ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

నిర్మాత దిల్‌రాజు ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్‌ ప్రొడ్యూసర్. ఆయన చేతిలో నాలుగైదు భారీ చిత్రాలు, మరో నాలుగైదు మీడియం బడ్జెట్ చిత్రాలున్నాయి. ఏడాదికి ఓ పది సినిమాల వరకు తన ప్రొడక్షన్‌ లోనే రూపొందుతుంటాయి. ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా, ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన దిల్‌రాజు.. నిర్మాతలను శాషించే స్థాయికి వెళ్లారు. నిర్మాణ రంగానికి సంబంధించి తానే పెద్దగా వ్యవహరిస్తుండటం విశేషం. 

ఇదిలా ఉంటే ఇప్పుడు లుగు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ దిల్‌రాజుకి పెద్ద షాకిచ్చింది. సంక్రాంతికి తాను నిర్మించిన చిత్రానికి థియేటర్లు లేకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నిర్మాతల మండలి నిర్ణయాలను కఠినంగా అమలు చేసే పని పూనుకుంది. ఇదే ఇప్పుడు దిల్‌రాజుకి పెద్ద దెబ్బగా మారబోతుంది. దిల్‌రాజు ప్రస్తుతం తమిళంలో విజయ్‌తో `వరిసు`(తెలుగులో `వారసుడు) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. 

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇటీవల కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణ `వీర సింహారెడ్డి` చిత్రాలు సంక్రాంతికే రాబోతున్నాయి. వీటితోపాటు అఖిల్‌ `ఏజెంట్‌` కూడా సంక్రాంతికే రిలీజ్‌కి డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. అంతకు ముందు సంక్రాంతి బరిలో ఉన్న `ఆదిపురుష్‌` వాయిదా పడిన విషయం తెలిసిందే. అది జూన్‌కి వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రాలకు సంక్రాంతి ఫ్రీగా దొరికేసింది. 

కానీ ఇప్పుడు తెలుగు చిత్రాలే సంక్రాంతికి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. చిరంజీవి, బాలయ్య సినిమాలంటే భారీ రిలీజ్‌ ఉంటుంది. థియేటర్ల కోసం ఫైట్‌ తప్పదు. దీనికితోడు అఖిల్‌ `ఏజెంట్‌` మూవీ కూడా పొంగల్‌కే వస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూడు చిత్రాలు థియేటర్లు పంచుకోవాలి. అది కలెక్షన్లపై ప్రభావాన్ని చూపుతుంది. సంక్రాంతికి రెండు మూడు సినిమాలు ఆడతాయని, బాగుంటే మంచి కలెక్షన్లని సాధిస్తాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతుంటాయి. కానీ అంతకు మించి వస్తే కష్టమనే చెప్పాలి. 

దిల్‌రాజు నిర్మించిన విజయ్‌ సినిమా `వారసుడు` సంక్రాంతికే రాబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు థియేటర్ల కోసం ఫైటింగ్‌ నడుస్తుంది. నిజానికి `వారసుడు` డబ్బింగ్‌ మూవీ. ఇటీవల షూటింగ్‌ బంద్‌ సమయంలో దిల్‌రాజు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగు సినిమాలన్నీ చిత్రీకరణ ఆగిపోగా, `వారసుడు` మూవీని మాత్రం షూట్‌ చేశారు. అది డబ్బింగ్‌ చిత్రమని తెలిపారు. ఆ సమయంలోనే దిల్‌రాజుపై పలు విమర్శలు వచ్చాయి. కానీ అసలు ఆట ఇప్పుడు సంక్రాంతి థియేటర్ల విషయంలో చోటుచేసుకోబోతుంది. 

తమ సినిమాకి కూడా థియేటర్లని కేటాయించాలని ఆయన పట్టుబట్టడం, తన థియేటర్లని ఇతరుకు ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఇప్పుడు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అసలు మ్యాటర్‌ తెరపైకి వస్తుంది. 2019లో ఫిల్మ్ ఛాంబర్‌ తీసుకున్న నిర్ణయాలను బయటపెట్టింది నిర్మాతల మండలి. ఇందులో `తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని, నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ది: 08-12-2017 తేదీన న జరిగిన అత్యవసర మీటింగులో, "సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది".

ఈ విషయమై, ప్రముఖ నిర్మాత, ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ శ్రీ దిల్ రాజు గారు 2019 సంవత్సరంలో మీడియా ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ స్ట్రెయిట్ గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రధమ ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు "సంక్రాతి, దసరా పండుగలలో" కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎక్సిబిటర్స్ ను (ప్రదర్శకులు) కోరుతున్నాం` అని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ గౌరవ కార్యదర్శులు టి.ప్రసన్న కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల ఓ లేఖని విడుదల చేయడం విశేషం. 

దీంతో దిల్‌రాజు నిర్మించే `వారసుడు`కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కేటాయించడం కష్టం. మరి ఈ విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఓ రకంగా ఇది తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డ పరిస్థితి దిల్‌రాజుకి ఎదురవుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సమస్య నుంచి దిల్‌రాజు ఎలా బయటపడతాడు, తన సొంత థియేటర్లలో `వారసుడు`ని విడుదల చేసుకుంటాడా? లేక సినిమాని వాయిదా వేసుకుంటాడా? అనేది వేచిచూడాలి.