ఆస్కార్‌ అవార్డులు సాధించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లను తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా సత్కరించబోతుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన దిగ్గజాలు పాల్గొనే అవకాశం ఉంది.

`ఆర్‌ఆర్‌ఆర్‌` ఇండియన్‌ సినిమా ఘనతని, ముఖ్యంగా తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్‌ఆర్‌` చిత్రంలోని `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. పాటని రాసిన రచయిత చంద్రబోస్‌, పాటని కంపోజ్‌ చేసిన కీరవాణికి ఈ అత్యున్నత పురస్కారం వరించింది. మార్చి 12న అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్లో జరిగిన అవార్డుల సెర్మనీలో కీరవాణి, చంద్రబోస్‌ ఈ ఆస్కార్‌ పురస్కారం అందుకున్నారు. వీరికి అవార్డు దక్కి ఆల్మోస్ట్ నెల రోజులు కావస్తుంది. ఇప్పుడు చలనం కలిగింది టాలీవుడ్‌ ప్రముఖులకు. 

ఇప్పటికే ఆస్కార్‌ విన్నర్స్ ని చిరంజీవి తన ఇంట్లో సత్కరించారు. చంద్రబోస్‌ని సినిమా సెట్‌లో సత్కరించారు. కానీ మిగిలిన పరిశ్రమ వర్గాల నుంచి విషెస్‌లు తప్ప ప్రత్యక్ష సత్కారాలు లేవు. ఇంతటి అత్యున్నత పురస్కారాలు దక్కించుకున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచిగానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి చలనం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యింది. అకాడమీ అవార్డు విన్నర్స్ ని గ్రాండ్‌గా సత్కరించేందుకు నిర్ణయించుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ దీనికి నడుం బిగించడం విశేషం. దీంతోపాటు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, మా, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ హైదరాబాద్‌, ఎఫ్‌ఎన్‌సీసీ వంటి తొమ్మిది సంస్థలు కలిసి ఆస్కార్‌ విన్నర్స్ ని సత్కరించబోతున్నాయి. 

ఈ సన్మాన కార్యక్రమంలో ఆదివారం(ఏప్రిల్‌ 9న) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగనుంది. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన స్టార్స్, హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు,రైటర్స్, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొననున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు సినిమాను ప్రేమించే ఆహూతులైన ప్రతి ఒక్కరికి ఈ సన్మాన కార్యక్రమం ఒక మంచి జ్ఞాపకం, గర్వించ దగిన ఉత్సాహం కానుందని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె ఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటించగా, అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. దీనికి కీరవాణి సంగీతం అందించారు. ఆస్కార్‌ గెలిచిన `నాటు నాటు` పాటకి చంద్రబోస్‌ లిరిక్స్ అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్‌, చరణ్‌లపై ఈపాటని ఉక్రెయిన్‌లో చిత్రీకరించడం విశేషం. ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం గతేడాది మార్చి 25న విడుదలై 1200కోట్ల కలెక్షన్లని సాధించింది.