ఒకప్పుడు భారీ సినిమాలు అన్నా.. కాన్సెప్ట్ సినిమాలన్నా... టాలీవుడ్ హీరోలు ధైర్యం చేసేవారు కాదు. ఒకవేళ కాస్త డిఫరెంట్ స్టోరీస్ కావాలంటే పక్క చూపులు చూసేవాళ్లు. ఏ కోలీవుడ్ దర్శకుడైనా ఖాలీగా దొరక్కపోతాడా.. మనతో సినిమా చేయకపోతాడా అని ట్రై చేసేవాళ్లు.ఇప్పుడు ట్రెండ్ మారింది.టాలీవుడ్ లోనే బోల్డంత క్రియేటివిటీ పెరిగింది. కాన్సెప్ట్ స్టోరీల కోసం పక్కచూపులు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

కంచె సినిమా టాక్ విన్నారుగా... సాధారణంగా ఇటువంటి సినిమాలు వస్తే గిస్తే..కోలీవుడ్ లో వస్తాయి. అక్కడ మురుగదాస్ వంటి దర్శకుడు మాత్రమే ఇటువంటి సబ్జెక్ట్స్ తీస్తాడని చెప్పుకునేవారు. ఆయన కూడా ఇటువంటి సినిమాలే తీసి..ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా పాగా వేశాడు. అయితే క్రిష్ దయ వల్ల టాలీవుడ్ కూడా ఇప్పుడు ఇటువంటి కాన్పెప్ట్ సబ్జెక్ట్ చూసింది. బాజీరావ్ మస్తానీ సినిమా చూస్తే మన టాలీవుడ్ లో అటువంటి చిత్రం రావడానికి ఇంకో పదేళ్లు పడుతుంది అనుకునే లోపే.. క్రిష్ గౌతమీ పుత్ర శాతకర్ణితో ఈలోటును తీర్చేశాడు.

ఇక వంద కోట్లు, రెండు వందల కోట్లు పెట్టి ..హాలీవుడ్ రేంజ్ సినిమా తీయాలంటే శంకర్ వైపే చూసేవాళ్లు. కానీ బాహుబలి తో.. 100 కాదు.. 500 కోట్లు పెట్టినా..అంతకు మూడింతలు వసూళ్లను అందించి.. బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానంటున్నాడు రాజమౌళి. ఎక్కడి దాకో ఎందుకు.. కొన్ని కోట్లు.. ఆరు సంవత్సరాలు.. టైమ్ ఇస్తే.మహాభారతాన్ని.. మహాద్భుతంగా తెరకెక్కిస్తాననే సవ్వాలే విసిరాడు దర్శకధీరుడు. బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్లింది.

మొదట సినిమాతోనే 40 కోట్లు.. రెండవ సినిమాతో వంద కోట్లకు పైగా వసూళ్లు... కుటుంబ కథా చిత్రాలతో కోట్లకు కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించాడు కొరటాల శివ. సాధారణంగా ఇటువంటి సినిమాలు తీయాలంటే కోలీవుడ్ లో కేఎస్ రవికుమార్ పేరు ముందు వినిపించేది. రజినీకాంత్ తో నరశింహా వంటి సినిమా అందించిన దర్శకుడు ఈయన. ఇప్పుడు ఈ ట్రెండ్ లోనే మనకు కొరటాల అద్భుతమైన ఫ్యామిలీ సినిమాలను అందిస్తూ దూసుకుపోతున్నాడు.

2016 టాలీవుడ్ కి చాలానే ఇచ్చింది. మన రేంజ్ ని పెంచింది. బడా సినిమలు, క్రియేటివ్ కథల కోసం కోలీవుడ్ వైపు చూడాల్సిన అవసరం లేదని చెప్పింది. కోటి రూపాయల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన క్షణం, పెళ్లి చూపులు సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా..అనేక భాషల్లో రీమేక్ కి రెడీ అవుతున్నాయి.