చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి నటి జీవిత రాజశేఖర్ వివరణ ఇచ్చారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇక్కడే ఉన్నానని చెప్పారు.
చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత రాజశేఖర్ వివరణ ఇచ్చారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇక్కడే ఉన్నానని చెప్పారు. తనపై కేసు పెట్టిన వ్యక్తిపై ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. తనపై కేసు పెట్టిన వ్యక్తి ఎంతో మందిని మోసం చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. తప్పు చేస్తే అందరి ముందు చెప్పే ధైర్యం ఉందన్నారు.
దాదాపు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. కోటేశ్వరరాజు చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులో సమన్లు తమకు అందలేదని చెప్పారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని అన్నారు. తాను తప్పు చేస్తే చట్టం ఉరికే ఉండదన్నారు. తమపై కావాలనే బురద జల్లుతున్నారని చెప్పారు. కోర్టు పరిధిలో ఆ విషయం ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని అన్నారు.
రకరకాల థంబ్ నెయిల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా జీవిత చెప్పారు. ఇటీవల తన కూతురుపై కూడా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతుళ్లు చదవుకుంటున్నారని.. వాళ్లకు యాక్టింగ్ అంటే ఇష్టమని.. వచ్చిన ఆఫర్స్ చేస్తున్నారని చెప్పారు. తన కూతురు గురించి ప్రచారం జరిగినప్పుడు చాలా చోట్ల నుంచి ఫోన్స్ వచ్చాయని తెలిపారు. గతంలో కూడా అరెస్ట్ వారెంట్ అని వార్తలు రాశారు.. ఆ తర్వాత అది ఏమైందన్నది ఎవరైనా రాశారా..? అని ప్రశ్నించారు.
తాను ఎవరికి అన్యాయం చేయనని జీవిత చెప్పారు. ఓపెన్‌గా మాట్లాడటం కూడా తప్పవుతుందని అన్నారు. ఇటీవల నిహారిక విషయంలో కూడా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు ఫ్యామిలీ మీద ట్రోల్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తున్నాయని చెప్పారు. సెలబ్రిటీలు అయినంత మాత్రానా ఏది పడితే అది రాయొచ్చు అనుకోవడం సరికాదన్నారు. ‘‘మీరు లేకుండా మేము లేం.. మేము లేకుండా మీరు లేరు’’ అని అన్నారు. థంబ్ నెయిల్స్ పెట్టేటప్పుడు.. ఏదైనా న్యూస్ రాసేముందు ఒక్కసారి తమ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, జ్యో స్టార్ ఎండీ హేమ.. జీవితపై చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్ట్ ని ఆశ్రయించారు. రూ. 26కోట్లు ఎగ్గొట్టారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారనే ఆరోపణలు జీవితా రాజశేఖర్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేమ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయగా, నగర కోర్ట్ జీవితకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తనకు జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ ఆయ్యానని జ్యోస్టార్ ఎండీ హేమ ఆరోపిస్తున్నారు. తమకు రావలసిన రూ. 26 కోట్లు రూపాయలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వెల్లడించారు. `గరుడ వేగ` సినిమాకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించారు. 2017లో రాజశేఖర్ హీరోగా గరుడవేగ (Garudavega) చిత్రం విడుదలైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఈ సినిమా నిర్మాణం కోసం జ్యో స్టార్ సంస్థ యజమాలు తమ ఆస్తులు అమ్మి డబ్బులు సమకూర్చారట. చివరకు తమకు రావలసిన డబ్బులు జీవితా రాజశేఖర్ చెల్లించలేదనేది వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తమ ఆస్తులు బినామీ పేర్లకు మళ్లించి రాజశేఖర్, జీవితా దంపతులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తుంది. అయితే కొన్నాళ్లుగా జీవిత రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కేసు నడుస్తుంది. ఈ కేసులో రాజశేఖర్ (Rajashekar) జైలు వెళ్లడం ఖాయమని జ్యో స్టార్ సంస్థ మీడియాకు తెలియజేశారు.
