పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మరో పదిరోజుల్లో థియేటర్స్ లో దిగనుంది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందు తెలంగాణా పోలీసులు వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చారు. వకీల్ సాబ్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి అనుమతులు నిరాకరించి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు.


ఏప్రిల్ 3వ తేదీన హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ నందు వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నద్దం అవుతున్నారు. జే మీడియా ఈ ఈవెంట్ ని నిర్వహించాల్సి ఉండగా.. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. కరోనా వైరస్ మరలా పంజా విసురుతున్న నేపథ్యంలో మీటింగ్స్, సమావేశాలకు, బహిరంగ వేడుకలకు అనుమతి లేదని తెలంగాణా ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జీవో జారీ చేయడం జరిగింది. 
 

సదరు జీవో ప్రకారం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేమని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వాహకులు తెలియజేశారు. దీనితో అభిమానుల మధ్య అట్టహాసంగా నిర్వహించాలనుకున్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకకు బ్రేక్ పడింది. మరోవైపు వకీల్ సాబ్ ట్రైలర్ కి విశేష ఆదరణ దక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.