'ఆర్ ఆర్ ఆర్' అనగానే మనకు ఖచ్చితంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గుర్తు వస్తుంది. ఆ హ్యాష్ ట్యాగ్ అంతలా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ కు ఉన్న క్రేజ్ ని డైరక్టర్ తేజ, హీరో రానా కలిసి తమ ఖాతాలో కలిపేసుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే చిత్రం టైటిల్ కూడా ఇదే హ్యాష్ ట్యాగ్  వచ్చేలా ఉంది.

వివరాల్లోకి వెళితే.. ‘నేనే రాజు నేనే మంత్రి’తో సోలో హీరోగా రానా కెరీర్‌కు బిగ్గెస్ట్‌ హిట్‌ను ఇవ్వడమే కాక.. తన వరుస ఫ్లాప్‌లకు చెక్‌ చెప్పుకున్నాడు దర్శకుడు తేజ. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. దాంతో ప్రస్తుతం వీరు ఇద్దరూ మరోసారి తెరపైకి రాబోతున్నారు. తేజ ఈసారి రానా కోసం ఓ అదిరిపోయే డార్క్‌ థ్రిల్లర్‌ను సిద్ధం చేసి పెట్టాడని చెప్తున్ారు. ఇప్పటికే ఆయనకు కథ వినిపించి ఓకే చేయించుకోవడం కూడా జరిగిపోయిందంటున్నారు. 

దీనికి ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే ఆసక్తికర టైటిల్‌ను  పెట్టారు. ఈ టైటిల్‌ను బట్టీ చూస్తుంటే ఈ చిత్రంలో రానాది నెగిటివ్ షేడ్స్  ఉన్న  పాత్రగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అలాగే ...ఆర్ ఆర్ ఆర్ అని షార్ట్ ఫామ్ లో ఈ టైటిల్ వస్తుంది. దాంతో రాజమౌళి చేస్తున్న చిత్రం హ్యాష్ ట్యాగ్ క్రెడిట్ ఈ సినిమాకు వస్తుంది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లదే రాజ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలని ప్లే చేస్తున్న స్ట్రాటజీ అంటున్నారు సినిమా వాళ్లు. 

 ప్రస్తుతం హీరో రానా... వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చేస్తున్నారు. దీని తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ చేయనున్నాడు. ఇది వేసవి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తర్వాత తేజతో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్లవచ్చు.