Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్... ఎన్టీఆర్ కి మరో తలనొప్పి!
పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నా జూనియర్ ఎన్టీఆర్ కి విమర్శలు తప్పడం లేదు. నేడు చంద్రబాబు అరెస్ట్ పై ఆయన స్పందించకపోవడంతో ఓ వర్గం ఆయన్ని టార్గెట్ చేసింది...
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) భారీ స్కామ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ ఆయన్ని అరెస్టు చేసింది. దీనికి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య, రామకృష్ణ బావ చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరెస్ట్ ని నిరసిస్తూ వీడియో విడుదల చేశారు. విజయవాడలో చంద్రబాబుని కలిసి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.
కాగా ఏపీ ప్రతిపక్ష నేత, చంద్రబాబు నాయుడు అరెస్టైన(Chandrababu Arrest) కాసేపటికే సోషల్ మీడియాలో ఓ డిమాండ్ తెరపైకి వచ్చింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దీన్ని ఖండించాలంటూ టీడీపీ వర్గాలు చర్చకు తెరలేపాయి. గంటలు గడుస్తున్నా ఎన్టీఆర్ నుండి ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఎప్పటిలాగే ఎన్టీఆర్(NTR) ని టార్గెట్ చేస్తున్నారు. అతడు నందమూరి హీరో కాదు. అవసరం తీరాక ఎదుగుదలకు కారణమైన వాళ్ళను వదిలేశాడని ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కూడా ఎన్టీఆర్ పై ఇదే విధమైన పొలిటికల్ దాడి జరిగింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి క్యారెక్టర్ పై వైసీపీ నేతలు తప్పుడు కామెంట్స్ చేశారని, ఆ ఘటనపై ఎన్టీఆర్ స్పదించిన తీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . మేనత్త పరువు తీస్తే నీలో ఫైర్ ఏది అని ఎన్టీఆర్ ని దుయ్యబట్టారు. వర్ల రామయ్యతో పాటు ఒకరిద్దరు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్స్ లో ఎన్టీఆర్ ని తూలనాడారు. ఇటీవల జరిగిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ పాల్గొనకపోవడం కూడా ఆయన మీద వ్యతిరేకతకు కారణమైంది.
టీడీపీ పార్టీ అధినాయకత్వం విషయంలో ఎప్పటికైనా పోటీ వస్తాడనే ఎన్టీఆర్ ని బాబు వర్గం ఇలా బద్నామ్ చేస్తుందనే వాదన ఉంది. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి చంద్రబాబు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సభల్లో జై ఎన్టీఆర్ నినాదాలు బాబును కలవరపెడుతున్నాయి. అందుకే సందు దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేసేలా, కేడర్ లో ఆయనను తప్పుగా చిత్రీకరించేలా బాబు ప్రణాళికలు వేస్తున్నారని అని రాజకీయ విశ్లేషకుల వాదన.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ కేడర్ లో బాబు, లోకేష్ అంటే నచ్చనివారు కూడా ఎన్టీఆర్ ని సమర్థిస్తూ వస్తున్నారు. వ్యతిరేకుల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా టీడీపీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఎన్టీఆర్ కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి...