గతేడాది మీటూ ఉద్యమంతో పెను దుమారం రేపిన నటి తనుశ్రీదత్తా పలువురు నటులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. నానా పటేకర్ పై తనుశ్రీ కేసు కూడా పెట్టింది. నానా పటేకర్ కూడా తనుశ్రీ పై కంప్లైంట్ చేశాడు. తనుశ్రీ ఆరోపణల కారణంగా నానా పటేకర్ కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడింది.

ఇది ఇలా ఉండగా.. నానా పటేకర్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు క్లోజ్ చేశారు. దీంతో పోలీసులపై, న్యాయవ్యవస్థపై తనుశ్రీ మండిపడింది. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయని, ఈ రెండు వ్యవస్థలు అంతకంటే ఎక్కువ అవినీతిపరుడైన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తనుశ్రీ దత్తా దేశంలోని రెండు కీలక వ్యవస్థలపై సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాము మాత్రం ఈ కేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, కోర్టుని ఆశ్రయిస్తామని తనుశ్రీ తరుపున న్యాయవాది ప్రకటించారు.