`మీటూ`తో సంచలనం రేపిన నటి తను శ్రీ దత్తా కారు ప్రమాదానికి గురయ్యింది. టెంపుల్‌కి వెళ్తున్న క్రమంలో ఆమె కారు ప్రమాదానికి గురైనట్టు తెలిపింది. ఈ ఘటనలో ఆమె కాలుకి గాయాలయ్యాయి.
`మీటూ` ఉద్యమంతో బాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి తను శ్రీ దత్తా కారు ప్రమాదానికి గురయ్యింది. ఆమె టెంపుల్‌ని సందర్శించే క్రమంలో తన కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు చెప్పింది. మంగళవారం ఆమె శ్రీ మహాకాళ అమ్మవారిని దర్శించుకుంది. ఈ విషయాన్ని తను శ్రీ దత్తా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంది. టెంపుల్‌కి వెళ్తున్న క్రమంలో తనుశ్రీ దత్తా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందట. బ్రేకులు ఫెయిల్ కావడంతో కారు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది.
అయితే పెద్దగా ప్రమాదం ఏం లేదని, కాలుకి కొన్నికుట్లతోనే బయటపడినట్టు చెప్పింది తనుశ్రీ దత్తా. తాజాగా శ్రీ మహాకాళ అమ్మవారిని దర్శించున్న అనంతరం ఆ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. `ఈ రోజు చాలా సాహసోపేతమైన రోజు. కానీ చివరకు మహాకాళ దర్శనానికి వచ్చాను. గుడికి వెళ్లే దారిలో ఘోర ప్రమాదం. బ్రేక్ ఫెయిల్ కావడంతో క్రాష్ అయ్యింది. కొన్ని కుట్లు పడ్డాయి. జై శ్రీ మహాకాళ` అని పేర్కొంది తనుశ్రీ దత్తా. వీడియోలో ఆమె కాలు కుంటుతూ కనిపించింది. అంతకు మించి ఎలాంటి గాయాలు కనిపించలేదు.
మరోవైపు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అనేక విషయాలను వెల్లడించింది తను శ్రీ దత్తా. `నా విశ్వాసం గుడ్డిది కాదు. అది చూస్తుంది, అనుభూతి చెందుతుంది. తెలుసుకుంటోంది. జీవితం ఊబిలా అనిపించినప్పుడల్లా నా విశ్వాసం నా దగ్గర ఉన్న తాడులా ఉపయోగపడుతుంది. ఓ కవచంలా పనిచేస్తుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలియని ఆ భయంకరమైన క్షణంలో నా హృదయంలో ఒక చిన్న స్వరం నాతో మాట్లాడింది. నేను బాగుంటానని చెప్పింది.నేను ఎముకలు విరగకుండా ఉండాలని ప్రార్థించాను. దీంతో అలా జరగలేదు. అందుకే నేను విశ్వాసంతో జీవించాలని ఎంచుకున్నా. ఏదైనా నా మంచికే జరుగుతుంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. రేపు మంచి రోజు అవుతుంది` అని పేర్కొంది తనుశ్రీ దత్తా.
తెలుగులో బాలకృష్ణతో `వీరభద్ర` చిత్రంలో నటించింది తనుశ్రీ దత్తా. ఆమె తెలుగులో చేసిన ఏకైక సినిమా ఇది. బాలీవుడ్‌లోనూ అడపాదడపా చిత్రాల్లోనే మెరిసింది. ఇదిలా ఉంటే ఆమె 2018లో బాలీవుడ్‌లో `మీటూ` ఉద్యమానికి తెరలేపిన విషయం తెలిసిందే. నానా పటేకర్ వంటి పలువురు పేర్లని ఆమె బయటపెట్టింది. దుమారం రేపింది. ఈ ఉద్యమం సౌత్‌లోనూ వ్యాపించి సంచలనంగా మారింది. చాలా మంది కథానాయికలు, అమ్మాయిలు ఆ సమయంలో `మీటూ` ఉద్యమంలో భాగంగా తమకు జరిగిన అన్యాయాలను, తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించారు. సంచలనంగా సృష్టించిన ఈ విషయంతో తనుశ్రీ దత్తా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
