దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా సైరా నరసింహారెడ్డి, సాహో చిత్రాలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిత్ర పరిశ్రమలో పలు అంశాలపై తమ్మారెడ్డి తరచుగా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు తెలుగు సినిమా స్థాయి పెరుగుతూ పోతోంది. చిన్న సినిమాలు కూడా రాణిస్తున్నాయి. ఎవరు, కొబ్బరిమట్ట, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలు మంచి కంటెంట్ తో వచ్చి విజయం సాధించాయి అని తమ్మారెడ్డి అన్నారు. 

ఇక పెద్ద సినిమాలు సాహో, సైరా గురించి మాట్లాడుకుంటే.. ఈ రెండు తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రాలు అని తమ్మారెడ్డి అన్నారు. సాహో, సైరా రెండు భారీ చిత్రాలు నెలరోజుల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. సాహో  చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుంది.. బాహుబలిని అధికమిస్తుందా.. సైరా, సాహో చిత్రాల్లో ఏ చిత్రం అత్యధిక వసూళ్లు సాధిస్తుంది అనే చర్చ మాట్లాడుకోవడానికి చాలా సరదాగా ఉంటుందని తమ్మారెడ్డి అన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి 30 ఏళ్లుగా టాలీవుడ్ ఖ్యాతిని పెంచుతున్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు అని తమ్మారెడ్డి అన్నారు. 

సైరా, సాహో లాంటి చిత్రాలు రావడం మంచిదే. కానీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం సినిమాలకు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది అని తమ్మారెడ్డి అన్నారు. చిన్న సినిమాకు కూడా కనీసం 6 కోట్లు ఖర్చవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాల గురించి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. అదే సమయంలో భారీ బడ్జెట్ లో వచ్చి నష్టపోయిన చిత్రాల పరిస్థితి ఏంటి. 

ఈ విషయంలో దర్శకనిర్మాతలు జాగ్రత్త వహించాలి. మంచి కంటెంట్ తో సినిమా తీసేందుకు ప్రయత్నించాలి అని తమ్మారెడ్డి అన్నారు.