Vijayakanth: విజయ్ కాంత్ అభిమానుల్లో ఆందోళన, ఆనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన హీరో
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ హాస్పిటల్ పాలు అయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరడం.. అభిమానులను కలవరపెడుతోంది.
తమిళనాట సినీగ్లామర్ కు పొలిటికల్ ఇమేజ్ కూడా తోడై.. ఎంతో మంది తారలు నాయకులుగా అవతారం ఎత్తారు. ఒకప్పుడు కోలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను పొందిన హీరో విజయ్ కాంత్. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోశారు. లక్షల మంది అభిమానులను సంపాదించాడు. ఇక సినిమాలు వదిలి.. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన డీఎండీకేను స్థాపించారు. ఇక చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయ్ కాంత్. అప్పుడప్పుడు ఆయన ఆరోగ్యం విషయం అవ్వడం.. తరువాత కోలుకోవడం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి విజయ్ కాంత్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది.
తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో విజయ్ కాంత్ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. సాధారణ వైద్య పరీక్షలు అనంతరం ఆయన్ను ఒక రోజు అబ్జర్వేషన్ లో ఉంచారట డాక్టర్లు. ఈ రాత్రికి హాస్పిటల్ లోనే ఉండి తరువాత రోజు ఇంటికి చేరుకుంటారని సమాచారం. ఇక చాలా కాలంగా విజయకాంత్ డయాబెటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఎక్కడికి వెళ్లినా విజయ్ కాంత్ వీల్ చైర్ లోనే వెళ్తుంటారు. ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులుచెబుతున్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న విజయకాంత్ తమిళ సినీ పరిశ్రమపై తనదైన ముద్రను వేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి… దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం ను స్థాపించారు. తమిళ నటుడు, నటీనటుల సంఘానికి అధ్యక్షుడుగా కూడా విజయకాంత్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.