దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి తన పోస్ట్ తో చురకలంటించింది హీరోయిన్ తాప్సీ. సోమవారం నాడు మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. 

అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ పేపర్ ఆర్టికల్ ను తాప్సి ట్యాగ్ చేస్తూ.. 'అనుమానంతో తల పగలగొట్టాడా..? బహుసా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను చంపేశాడేమో' అంటూ సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.

ఇటీవల సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'కబీర్ సింగ్' సినిమా విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. 'ఒక అమ్మాయి, అబ్బాయి సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకరిపై మరొకరు చేయి చేసుకునే స్వేచ్చ లేనప్పుడు అక్కడ ప్రేమ, ఎమోషన్ ఉంటుందని నేను అనుకోను.. తన సొంతం అనుకున్న అమ్మాయిని అబ్బాయి ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు ఆ బంధంలో ఎమోషన్ కనిపించదు' అన్నారు.

ఈ వ్యాఖ్యలపై చాలా మంది ఫైర్ అయ్యారు. సమంత, అనసూయ, మంచు లక్ష్మి వంటి తారలు సందీప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాప్సీ కూడా సందీప్ పై కౌంటర్ వేయడంతో నెటిజన్లు ఆమెపై  మండిపడుతున్నారు.