ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి మ్యాజికల్ స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో చక్కగా సైరా చిత్రాన్ని ప్రజెంట్ చేశారు.  

ఇలాంటి హిస్టారికల్ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కాలంటే చాలా ప్రిపరేషన్ కావాలి. సైరా చిత్రానికి తెరవెనుక హీరోలు చాలా మందే ఉన్నారు. ఉయ్యాలవాడ చరిత్ర సినిమా కథగా మారడానికి మూలకారకులు పరుచూరి బ్రదర్స్. ఓ దశాబ్దం క్రితమే చిరంజీవికి తాము ఈ కథని వివరించినట్లు, అందులో మీరే హీరోగా నటించాలని పట్టుబట్టినట్లు పరుచూరి బ్రదర్స్ ఇదివరకే తెలిపారు. 

సైరా చిత్రానికి కథ అందించింది పరుచూరి బ్రదర్సే. ఇక సైరా చిత్రంలో డైలాగులు కూడా బాగా పేలాయి. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ వరుసగా బడా హీరోల చిత్రాలకు మాటలు అందిస్తున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణి, ప్రస్తుతం సైరా లాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు డైలాగులు అందించడంతో బుర్రా సాయిమాధవ్ సక్సెస్ అవుతున్నారు. 

సైరా చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా తెరవెనుక హీరోనే. 19వ శతాబ్దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ పై ఆమె అధ్యయనం చేశారు. చిరంజీవి, అమితాబ్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార లాంటి భారీ తారాగణానికి సుస్మిత కాస్ట్యూమ్స్ అందించారు.