పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం 'ఓజీ' మూవీ నుంచి రోజుకో అప్ డేట్ అందిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం 'సువ్వి సువ్వి'ని విడుదల చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న 'ఓజీ' సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ గా 'ఫైర్‌ స్టార్మ్'కి విశేష స్పందన లభించింది. తుఫాను లాంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తాజాగా 'ఓజీ' నుంచి రెండవ గీతం 'సువ్వి సువ్వి' విడుదలైంది. 'ఫైర్‌ స్టార్మ్'కి పూర్తి భిన్నంగా హృదయాలను హత్తుకునేలా 'సువ్వి సువ్వి' గీతం సాగింది. విడుదలైన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతల మనసులను గెలుచుకుంటోంది ఈ సాంగ్. తమన్ అద్భుతమైన సంగీత ప్రయాణంలోఈ పాట ఒకటిగా నిలవబోతోందంటున్నారు సంగీత అభిమానులు.

'సువ్వి సువ్వి' అనే ఈ ప్రేమ గీతాన్ని తమన్ ఎంత అందంగా స్వరపరిచారో.. గాయని శృతి రంజని అంతే మధురంగా ఆలపించారు. ఇక కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొని వచ్చింది. 'సువ్వి సువ్వి' పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్, సున్నితమైన పాత్రలో కన్మణిగా ప్రియాంక మోహన్ కనిపించబోతున్నారు. ఈ పాటలో వీరిద్దరిని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 'ఓజీ' ఈ జంటను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ఓజీ'లో పవన్, ప్రియాంక తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఈక్రమంలో ప్రమోషన్స్ కు కూడా పదును పెట్టారు టీమ్.