సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మరణం నుంచి బాలీవుడ్‌ సినీ పరిశ్రమ కోలుకోలేకపోతోంది. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నారు. తాజాగా అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కృతి తన సోదరుడికి సంబంధించి తన సోషల్ మీడియా పేజ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. తన అనుభవాలతో పాటు సోదరిడితో తన అనుబంధాన్ని షేర్ చేసుకుంది శ్వేతా. సుశాంత్ ఫోటోతో పాటు గతంలో సుశాంత్‌ తనకు స్వయంగా రాసి పంపిన నోట్‌ ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది.

సుశాంత్ సింగ్ గత ఆదివారం ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ మృతిపై విమర్శలు రావటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.

సుశాంత్ మరణం నేపథ్యంలో పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఆరు నెలల కాలంలో సుశాంత్ ఏడు సినిమాలు కోల్పోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పలు బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు సుశాంత్‌ను బ్యాన్ చేశారని అందుకే ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడన్న ప్రచారం జరుగుతోంది.