బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును చేధించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించిన పోలీసులు తాజాగా ..సుశాంత్ సహనటి సంజన సంఘీని పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. సుశాంత్‌తో చివరిగా కలిసి నటించిన సహనటి సంజననే కావడం గమనార్హం. సుశాంత్ ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటివరకూ 28 మంది స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశారు.

త్వరలో ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్‌ స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకోనున్నట్లు సమాచారం. తుది పోస్ట్‌మార్టం నివేదికలో సుశాంత్ గొంతు బిగుసుకుని ఊపిరాడకపోవడం వల్ల మరణించినట్లు వెల్లడైంది. అయితే.. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందనే విషయంపైనే పోలీసులు దృష్టిసారించారు. కాగా.. సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

ఇదిలా ఉండగా.. సుశాంత్ ఆత్మహత్యకు ముందు ట్విట్టర్ లో కొన్ని ట్వీట్స్ చేసి తర్వాత వాటిని డిలీట్ చేసినట్లు సమాచారం. ఆ ట్వీట్స్ లే ఏం రాశాడు అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ ట్వీట్స్ ఏంటో తెలిస్తే.. ఈ కేసులో అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.