Suriya and Venky Atluri: వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్ర ఓటీటీ హక్కులు రికార్డు ధరకి అమ్ముడయ్యాయి. నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్
సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకుంటోంది. .సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “విశ్వనాథం అండ్ సన్స్” అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాన్-ఇండియా రేంజ్‌లో సినిమాపై అంచనాలు పెరిగాయి. హీరోయిన్‌గా మమితా బైజు నటిస్తుండగా, సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తున్నారు.
భారీ ధరకి ఓటీటీ హక్కులు
వెంకీ అట్లూరి గత చిత్రాలు OTTల్లో విశేషంగా ఆదరణ పొందాయి. ముఖ్యంగా “లక్కీ భాస్కర్” నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా ఒక నెలపాటు గ్లోబల్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ విజయాలు సూర్య-అట్లూరి కాంబినేషన్‌పై మరింత క్రేజ్ తీసుకొచ్చాయి.తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.80 కోట్లు. సినిమాను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిస్తుండటంతో, ఈ డీల్ నిర్మాతకు ఆర్థికంగా భారీ లాభాన్ని తెచ్చిపెట్టనుంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా సినిమా సేఫ్ అయ్యిందని చెప్పొచ్చు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. సూర్య స్టార్ పవర్, వెంకీ అట్లూరి స్టోరీ టెల్లింగ్, బ్లాక్‌బస్టర్ OTT డీల్ కలయికతో, ఈ సినిమా థియేటర్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుంది.
లక్కీ భాస్కర్ చిత్రం భారీ సక్సెస్ కావడంతో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రారంభం నుంచే సూర్య, వెంకీ అట్లూరి సినిమాపై క్రేజ్ పెరిగింది. నిర్మాత నాగవంశీకి ఇది జాక్ పాట్ డీల్ అనే చెప్పాలి. ఇటీవల వార్ 2 తో నష్టాలు ఎదుర్కొన్న నాగవంశీకి ఇది ఊరటనిచ్చే అంశం.
