తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు సమానమైన క్రేజ్ ఉంది. గజిని, సింగం సిరీస్ లాంటి చిత్రాలతో సూర్య తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా అనువాదం అవుతూ ఉంటుంది. ఇటీవల సూర్య నటించిన చిత్రం ఎన్జీకే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించింది. 

మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని సెల్వరాఘవన్ తెరక్కించారు. కానీ ఆడియన్స్ కు చేరువయ్యేలా ఈ కథని తీర్చిదిద్దలేకపోయారు. ఫలితంగా అన్ని ప్రాంతాల్లో ఎన్జీకే చిత్రం నిరాశపరిచింది. తాజాగా హీరో సూర్య ట్విట్టర్ వేదికగా ఎన్జీకే ఫెయిల్యూర్ పై స్పందించాడు. 

ఎన్జీకే చిత్రంపై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. అలాగే చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు అని సూర్య ట్వీట్ చేశాడు. 

త్వరలో సూర్య మరో భారీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కెవి ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. సూర్య ఈ చిత్రంలో ప్రధానికి రక్షణ కల్పించే అధికారి పాత్రలో నటిస్తున్నాడు.