కరోనా మహమ్మారి కోరలు చాచి అమాయకుల ప్రాణాలు కబళిస్తుంది. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే భేదం లేకుండా పలువురు కరోనా కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే పలు చిత్ర పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులతో పాటు పాత్రికేయులు కరోనా సోకి ప్రాణాలు విడిచారు.

 
తాజాగా మరో చిత్ర ప్రముఖుడు కరోనాకు బలయ్యారు. కోలీవుడ్ నిర్మాత సేలం చంద్రశేఖరన్ మరణవార్త ఆలస్యంగా వెలుగు చూసింది. సేలం చంద్రశేఖరన్ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి కారణం కరోనా సోకడమే అని నిర్ధారణ అయ్యింది.  చాలాకాలంగా  సేలం చంద్రశేఖరన్ చిత్రాలు నిర్మించడం లేదు.  59 ఏళ్ల చంద్రశేఖరన్ సేలంలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా కరోనా పాజిటివ్‌ అని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచా రు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

 

2005లో సూర్య హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన గజిని చిత్రానికి సేలం చంద్రశేఖరన్  నిర్మాత. గజిని తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తెలుగులో సూర్యకు ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం గజిని. అలాగే  విజయకాంత్‌ నటించిన శబరి, భరత్‌ నటించిన ఫిబ్రవరి 14, కిలాడి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.