హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వీడొక్కడే, బ్రదర్స్ లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ హ్యాట్రిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించిన బందోబస్త్ చిత్రం సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్య ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బందోబస్త్ చిత్రంలో సూర్య సరసన కుర్ర బ్యూటీ సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

సాయేషా సైగల్, తమిళ హీరో ఆర్య ఈ ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఆ పాత్రలో అల్లు శిరీష్ నటించాల్సింది అని సూర్య తెలిపాడు. కొన్ని కారణాలవల్ల చివరి నిమిషంలో ఆర్యని తీసుకున్నాం అని పేర్కొన్నాడు. 

ఆర్య పక్కనే ఉండగా సాయేషాతో రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని సూర్య తెలిపాడు. ఇక ఈ చిత్రంలో తాను చాలా లుక్స్ లో కనిపించబోతున్నట్లు సూర్య వెల్లడించాడు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. మన దేశ భద్రతకు సంబంధించి అనేక విషయాల్లో అవగాహన కల్పిస్తుందని సూర్య పేర్కొన్నాడు.