సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. సినిమాలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కరాన్ని రజనీకి తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర సామాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు.

ఇటీవల కేంద్రం జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్‌తో రజనీకాంత్‌కి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుని ప్రకటించడం విశేషం. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం రజనీకి ఈ అవార్డుని ప్రకటించడం చర్చనీయాంశంగా, ఆసక్తికరంగా మారింది. 

ఈ సందర్భంగా మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ట్వీట్‌‌ చేశారు. `2020కిగానూ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుని ఇండియాలోనే గ్రేటెస్ట్ యాక్టర్‌ రజనీకాంత్‌కి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఓ నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రైటర్‌గా ఇండియన్‌ సినిమాకి ఎంతో సేవ చేశారు. ఐకానిక్‌గా నిలిచిపోయారు` అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్యూరీ మెంబర్స్ ఆశాబోంస్లే, సుభాష్‌ ఘాయ్‌, మోహన్‌లాల్‌, శంకర్‌, బిశ్వాజిత్‌ చటర్జీలకు ధన్యవాదాలు తెలిపారు.

బస్‌ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్‌ ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన నటుడిగా, నిర్మాతగా ఇండియన్‌ సినిమాకి సేవలందిస్తున్నారు. కె బాలచందర్‌ శిష్యుడిగా కెరీర్‌ని ప్రారంభించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. రజనీ అంటే స్టయిల్‌, స్టయిల్‌ అంటే రజనీ అనేలా వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు రజనీకాంత్‌. తనదైన మేనరిజం, యాక్షన్‌, స్టయిల్‌తో సౌత్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. 

తమిళంలోనే కాదు, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేశారు. పాన్‌ ఇండియా సినిమాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. కానీ ఈ పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ని రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించారు రజనీకాంత్‌. ఆయన నటించిన సినిమాలు చాలా వరకు తమిళంలోపాటు తెలుగు, హిందీ, కన్నడలో విడుదలవుతుంటాయి. అన్నింటా బ్లాక్‌ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. అదే సమయంలో భారీ బడ్జెట్‌ చిత్రాలకు తెరలేపింది కూడా రజనీనే. `రోబో`తో ఆయన సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. 

దాదాపు 170 సినిమాలు చేసిన రజనీకాంత్‌కి అనేక పురస్కారాలు వరించాయి. ఇప్పటికే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ వంటి భారత అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. దీంతోపాటు `కలైమామని`, తమిళనాడు స్టేట్‌ గౌరవ పురస్కారం -ఎంజీఆర్‌ అవార్డు, ఎంజీఆర్‌- శివాజీ అవార్డు, ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు, ఆరు తమిళనాడు స్టేట్‌ అవార్డులు వరించాయి. తాజాగా ఆయన చెంతకు సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారంగా భావించి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

రజనీకాంత్‌కి భార్య లతా రజనీకాంత్‌, ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య ఉన్నారు. ఐశ్వర్య దర్శకురాలిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె హీరో ధనుష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరో కూతురు సౌందర్య గ్రాఫిక్‌ డిజైనర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తున్నారు. ఆమె విశగన్‌ వనంగమూడిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఆమెకిది రెండో వివాహం. 

ఇదిలా ఉంటే రజనీకాంత్‌ రజకీయాల్లోకి రావాలని తలంచారు. ఆయన రెండేళ్ల క్రితమే తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన చేశారు. గతేడాది డిసెంబర్‌లో పార్టీని ప్రకటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. దాదాపు సర్వం సిద్ధమైంది. అభిమానులతో మీటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఉన్నట్టుంది అనారోగ్యానికి గురికావడం, అది మూడు రోజులపాటు సీరియస్‌గా మారడం, అందరిని ఆందోళనకు గురి చేసింది. దీంతో రజనీ రాజకీయ ఎంట్రీకి సంబంధించిన ఆలోచనని విరమించుకున్నారు. ఇక తాను రాజకీయాల్లోకి రాబోనని, అభిమానులను క్షమించమని కోరిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, ఖుష్బు, మీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.