ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో షాక్ లో ఉన్న కృష్ణ ఆ బాధ నుండి కోలుకోలేకపోతున్నారు. తన భార్యతో కృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కృష్ణ చేసే ప్రతీ పనిలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండేది.

అటువంటి ఆమె తన పక్కన లేదనే బాధను కృష్ణ భరించలేకపొతున్నారు. జూన్ 27న కాంటినెంటల్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ విజయనిర్మల మరణించారు. ఆమె సంతాప సభను ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో విజయనిర్మలను గుర్తుచేసుకున్న సందర్భంలో కృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులతో విజయనిర్మల ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు కృష్ణ. విజయనిర్మలకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువని, పాతిక ఏళ్ల క్రితం జరిగిన విషయాలను కూడా గుర్తుంచుకునేదని.. అలాంటిది చివరి రోజుల్లో అల్జీమర్స్ సమస్యతో బాధపడిందని దీంతో ఆమెకి జ్ఞాపకశక్తి లోపించిందని చెప్పారు.

రెండు మూడు రోజుల ముందు జరిగిన విషయాలు కూడా గుర్తుండేవి కావని.. ఆమె మెదడు పక్క నరం బలహీనం కావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని భార్యను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.